AP New Cabinet: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరువాత స్థానాన్ని తనకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్. నరసన్నపేటలో గ్రామ వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన తర్వాత స్థానాన్ని నాకు ఇచ్చి ఎంతో గౌరవం కల్పించారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారిని సీఎం జగన్ (AP CM YS Jagan Mohan Reddy) తప్పక గుర్తిస్తారని.. పార్టీ కోసం పని చేసే వారికి ఉన్నతమైన గుర్తింపు లభిస్తుంది అనడానికి తానే ఉదాహరణ అన్నారు. గత మూడేళ్లలో తొలుత ఆర్అండ్‌బీ శాఖకు, ఇప్పుడు రెవెన్యూ శాఖకు మంత్రిగా పని చేసే అవకాశం లభించిందన్నారు.


ఏ పని అప్పగించినా త్రికరణశుద్ధిగా చేస్తా..
సీఎం జగన్ తనకు ఏ పదవి, పనిని అప్పగించినా త్రికరణశుద్ధిగా పని చేస్తా అన్నారు. 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ప్రతిష్టాత్మక రీ సర్వే కార్యక్రమాలు నా చేతుల మీదగా ప్రారంభం కావడాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. పాత, కొత్త నేతల కలయికతో నూతన మంత్రివర్గం ఏర్పాటు కానుంది. ముందుగా చెప్పినట్లు మేమంతా  ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానంగా ఇప్పుడు పని చేయాల్సి ఉంటుందన్నారు. సీఎం అప్పగించే బాధ్యతలను ఆచరించే వ్యక్తిగా తానెప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. శ్రీకాకుళం (Ministers From Srikakulam) నుంచి  ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజులకు కొత్త కేబినెట్‌లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. నేటి సాయంత్రం అధికారిక ప్రకటన రానుంది.


2023లోనూ వైఎస్సార్‌సీపీదే విజయం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీదే విజయమని.. నా నియోజకవర్గం లోని నాయకులు అందరూ ముఖ్యమంత్రి జగన్ మాటను గౌరవించి ముందుకు సాగుతాం అన్నారు. మరోసారి వైఎస్ జగన్‌ను ఏపీ సీఎంగా చూడటమే తమ అందరి లక్ష్యమని పేర్కొన్నారు. పదవుల కోసమో, మంత్రి స్థానం కోసం ఆలోచించే వ్యక్తిని తాను కానని.. ఒక సిన్సియర్ కార్యకర్తగా పని చేసుకుపోవటమే తనకు తెలుసని చెప్పారు. జిల్లాల పార్టీ బాధ్యులుగా, రీజనల్ కోఆర్డినేటర్ గా మా కోసం అప్పగించే బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చి 2023లో ప్రభుత్వాన్ని  మళ్లీ ఏర్పాటు చేసే బాధ్యతను తీసుకుంటామని ధర్మాన కృష్ణదాస్ చెప్పుకొచ్చారు.


ఏపీ కొత్త కేబినెట్‌పై ఉత్కంఠ..
ఇటీవల రాజీనామా చేసిన తాజా మాజీ మంత్రులలో 10 మందికి కొత్త కేబినెట్‌లో చోటు దక్కడం ఖాయమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కొత్తగా 15 మందికి ఏపీ కేబినెట్‌లో సీఎం జగన్ అవకాశం కల్పించనున్నారు. అయితే పలు జిల్లాల్లో నేతలు తమకు ఈసారి చోటు దక్కుతుందని ధీమాగా ఉన్నారు. కొందరు తాజా మాజీ మంత్రులకు కొత్త కేబినెట్‌లోనూ చోటు దక్కుతుందని ఏపీలో బెట్టింగ్స్ కూడా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 


Also Read: AP New Cabinet: ఏపీ నూతన కేబినెట్‌పై ఉత్కంఠ! జిల్లాలవారీగా కొత్త మంత్రుల ఫైనల్ లిస్టు ఇదే? 


Also Read: Mekapati Gautham Reddy: రాజకీయాల్లోకి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి, ఉప ఎన్నికల్లో పోటీకి సై!