AP Municipal Workers : ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం స్పందించింది.  హెల్త్ అలెవెల్స్ యథాతథంగా అమలు చేయాలని నిర్ణయించింది. మున్సిపల్‌ కార్మికుల డిమాండ్‌లపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ గురువారం తెలిపారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం అయిందని తెలిపారు. కార్మికుల సమస్యలపై చర్చించామన్నారు.  ఓహెచ్‌వో ఇచ్చేందుకు రూ.6 వేలు అలానే ఉంచాలనే డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 6 వేలు యథాతథంగా ఇస్తామన్నారు. జీతంతో పాటు రూ. 6 వేలు ఓహెచ్వో కలిపి రూ. 21 వేలు వారికి అందించాలని నిర్ణయించామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆక్యుపేషనల్ అలవెన్స్ కొనసాగిస్తామన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించాలని కోరారు. 


మంత్రుల సబ్ కమిటీ 


హెల్త్ అలెవెన్స్ బకాయిలతో పాటు 11వ పీఆర్సీ ప్రకారం నెల జీతం రూ.20 వేలు, కరవు భత్యం ఇవ్వాలని గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు.  ఇటీవల కార్మిక సంఘాల నేతలతో మంత్రుల సబ్ కమిటీ చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు విఫలం అయ్యాయి. కార్మికుల సమ్మెతో పట్టణాల్లో చెత్త పేరుకుపోయి సమస్య తీవ్రం అవుతోందని భావించిన ప్రభుత్వం ఒక మెట్టుదిగొచ్చింది. మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.  


రూ. 21 వేల జీతం 


సీఎం జగన్ తో భేటీ అనంతరం మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల హెల్త్‌ అలెవెన్స్ లు యథాతథంగా కొనసాగించాలని సీఎం  ఆదేశించారని తెలిపారు.  కార్మికుల హెల్త్‌ అలెవెన్స్‌ రూ.6 వేలు అలాగే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. హెల్త్‌ అలవెన్స్‌తో కలిపి వేతనం రూ.21 వేలు ఇవ్వాలని సీఎం సూచించారన్నారు. కార్మికుల ఇతర డిమాండ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి సురేశ్‌ తెలిపారు. కార్మికుల ప్రధాన డిమాండ్లు పరిష్కరించినందున సమ్మె విరమించి, రేపటి నుంచి విధులకు హాజరుకావాలని మంత్రి సురేశ్ కోరారు.  


కార్మికుల డిమాండ్లు 


అయితే కార్మికులు ప్రధానంగా హెల్త్ అలెవెన్స్ బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు  11వ పీఆర్సీ సిఫార్సుల ప్రకారం నెల జీతం రూ.20వేలు, కరవు భత్యం ఇవ్వాలని కోరారు. మున్సిపల్‌ పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.  ఆప్కాస్‌ ద్వారా రిటైర్ అయిన కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు, వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.  ఉద్యోగ వివరణ చేసిన వారికి గ్రాట్యుటీ, పెన్షన్‌ చెల్లించాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు పెయిడ్ లీవ్, జీపీఎఫ్‌ ఖాతాలు తెరవడంతోపాటు హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.