రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో “జగనన్న విదేశీ దీవెన” పథకాన్ని నూతన మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. గురువారం అమరావతి సచివాలయంలో మాట్లాడిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున క్యూఎస్ ర్యాకింగ్ పొందిన 200 ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిధ్యాలయాల్లో సీట్లు సాధించిన నిరుపేద విద్యార్థులు అందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన వారికి పూర్తి ఫీజు రీఇంబర్స్ మెంట్ చేస్తామన్నారు. 100పైబడి 200 ర్యాకింగ్‌లో ఉన్న విద్యాలయాల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.50 లక్షల వరకూ ఫీజు రీఇంబర్స్ మెంట్ ఉంటుందని వెల్లడించారు. అపరిమితంగా సంతృప్తికర స్థాయిలో అర్హులు అందరికీ ఈ పథకం వర్తించే విధంగా మార్గదర్శకాలు రూపొందించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీలతో పాటు అగ్రవర్గాల నిరుపేద విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఈ పథకం అమలుకు ఆధాయ పరిమితి రూ.6.00 లక్షలుగా ఉండేదని, ఆపరిమితిని తమ ప్రభుత్వం రూ.8.00 లక్షలకు పెంచిందని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకం అమల్లో పలు లోపాలు ఉన్నట్లు విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో గుర్తించామని తెలిపారు మంత్రి నాగార్జున. లబ్దిదారుల ఎంపికలో ఆదాయ పరిమితిని పాటించకపోవడం, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తింపు అనే నిబంధనను ఉల్లంగించడం, అధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే కొందరు విద్యార్థులు చదువుతున్న విశ్వవిద్యాలయాలను, వెళ్లాల్సిన దేశాలను కూడా మార్చుకున్నట్లు గుర్తించామన్నారు. ఈ పథకం కింద కొందరు విద్యార్థులు డబ్బులు పొంది కోర్సు పూర్తి చేయకుండానే రాష్ట్రానికి తిరిగి వచ్చేశారన్నారు. 2016-17 నుంచి ఎంపికైన 3,326 మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.318 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదని మంత్రి తెలిపారు.
వీటన్నింటిపై విచారణ జరుపుతున్నట్టు మంత్రి నాగార్జున వెల్లడించారు. ఇలాంటి సమస్యలు లేకుండా ఉండేలా పకడ్బందీతో కొత్త విధానం తీసుకొచ్చామని వివరించారు. ప్రస్తుతం విధానంలో విదేశాల్లో చదువుకోవాలనుకునే ప్రతి పేద విద్యార్థికి సమాన అవకాశాలు దొరుకుతాయని తెలిపారు.