Ministers On Chandrababu : ఉత్తరాంధ్ర పై చంద్రబాబు దండయాత్ర చేస్తున్నార‌ని ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక్కడి ప్రజలు, ఈ ప్రాంత ఆత్మాభిమానంపై దాడి చేస్తున్నార‌ని మండిపడ్డారు.  అమరావతి రైతుల పాదయాత్రపై ప్రజలు తిరగబడితే అందుకు బాధ్యుడు చంద్రబాబే అవుతార‌ని మంత్రులు హెచ్చరిక‌లు జారీ చేశారు. ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మంత్రులు చంద్రబాబు రాజ‌ధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. ఎట్టి ప‌రిస్థితుల్లో విశాఖ శాస‌న రాజ‌ధాని అవుతుంద‌ని మంత్రులు స్పష్టం చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధ‌ర్మాన ప్రసాద‌రావు, రాజ‌న్న దొర‌, గుడివాడ అమ‌ర్ నాథ్ తో పాటుగా సీదిరి అప్పల‌రాజు చంద్రబాబు అమరావతి వ్యాఖ్యల‌ను ఉద్దేశించి మాట్లాడారు. 


రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే ప్రేమ 


అమరావతి రాజధానిపై చంద్రబాబుకు ఎందుకంత తాపత్రాయం అని మంత్రులు ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. అమరావతిపై చంద్రబాబుకు ప్రేమ లేదని, అక్కడ ఆయన చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే మమకారమన్నారు. గురువారం ఓ పుస్తక ఆవిష్కరణ అంటూ చేసిన హడావుడి, మీడియాలో కవరేజి చూస్తే అదంతా సీఎం జగన్ ను నోటికి వచ్చిన పదజాలంతో దూషించేందుకు పెట్టారని ఆరోపించారు.  విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ గా చేయాలన్నది వైసీపీ ప్రభుత్వ విధానం అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ఆ వేదికపై నుంచి రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడిన మాటలను ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా భావిస్తున్నామన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? అన్నది ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఉత్తరాంధ్ర నాయకులు సమాధానం చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు.  


ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్టదా? 


"ఇన్నాళ్లకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతుంటే, ఈ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా మాట్లాడుతున్న వారిని మీరు ఊరుకుంటారా? అని ఉత్తరాంధ్ర నాయకులను అడుగుతున్నాం.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా, సమభావంతో చూడాల్సిన  రాజకీయ పార్టీలు కొన్ని ఒక ప్రాంతానికే, అమరావతికే లబ్ధి జరగాలనే విధంగా మాట్లాడటం భావ్యం కాదు.  అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికి, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాకూడదు. రాష్ట్ర సంపద అందరిదీ.  ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ఆ పార్టీలకు చెందిన నాయకత్వాలను, మరి ముఖ్యంగా చంద్రబాబుని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు అమరావతి రాజధాని  పరిధిలోని ఆ 29 గ్రామాలు తప్పితే.. రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలు, ఆ జిల్లాల్లో ఉన్న వెనుకబడిన, మారు మూల  గ్రామాలు అవసరం లేదా? వాటి అభివృద్ధి పట్టదా? అని ప్రశ్నిస్తున్నాం." - మంత్రులు 


వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు 


అమరావతి రాజధానికి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం కాదని మంత్రులు తెలిపారు. అయితే అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండటానికి తాము వ్యతిరేకం అన్నారు.  అమరావతితోపాటు రాయలసీమలోని కర్నూలు న్యాయ రాజధానిగా, ఉత్తరాంధ్రలోని విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అదే వైసీపీ ప్రభుత్వం విధానమన్నారు.  పాదయాత్రల ద్వారా అమరావతి ప్రాంతానికి చెందిన ప్రజలను ప్రేరేపించి,  రెచ్చగొట్టి, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవాలంటే.. దీనికి ఈ ప్రాంత ప్రజలు సరైన సమాధానం చెబుతారన్నారు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఉంటుందని స్పష్టంగా చెబుతున్నామన్నారు. రాష్ట్రంలోని  మూడు ప్రాంతాల్లో మంచి జరగాలని, మూడు  ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసే తీరుతామని మంత్రులు స్పష్టం చేశారు. వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. 


Also Read : CM Jagan Review : కరవు ప్రాంతాల్లో చెరువులు కాల్వలతో అనుసంధానం-సీఎం జగన్


Also Read : Minister Gudivada Amarnath : ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పాలన, మూడు రాజధానులపై కొత్త బిల్లు- మంత్రి గుడివాడ అమర్ నాథ్