హైదరాబాద్ : ఏపీ రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ నేడు తెలంగాణ పర్యటనకు వచ్చారు. తెలంగాణలోని పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ సోమవారం దర్శించుకున్నారు. యాదాద్రికి వచ్చిన ఏపీ మంత్రి విశ్వరూప్‌నకు ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వయంభు నరసింహస్వామి వారిని దర్శించుకొని పినిపే విశ్వరూప్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి అర్చకులు నుంచి వేద ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం అధికారులు ఏపీ మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయం పునర్నిర్మాణం అద్భుంగా చేయడంతో సీఎం కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి ఆలయాన్ని ప్రత్యేక శ్రద్ధతో సీఎం కేసీఆర్ అద్భుతంగా పునర్మించారన్నారని చెప్పారు. మరో మూడు నెలల్లో కుటుంబ సమేతంగా యాదాద్రికి వచ్చి, స్వామి వారిని దర్శించుకుంటానని ఆయన తెలిపారు. కొన్ని రోజుల కిందట తనకు ఆరోగ్యం క్షీణించడంతో నరసింహస్వామికి మొక్కుకుని వైద్య చికిత్స కోసం ముంబైకి వెళ్లినట్లు చెప్పారు. తన ఆరోగ్యం కుదుటపడిందని, ఈ క్రమంలో మరోసారి స్వామివారిని దర్శించుకునేందుకు యాదాద్రికి వచ్చినట్లు మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.
సెప్టెంబర్ నెలలో మంత్రికి అస్వస్థత..
సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు. అమలాపురం పర్యటనలో ఉన్న మంత్రి విశ్వరూప్ కు ఛాతీలో నొప్పితో బాధపడ్డారు. ఆయనను ముందుగా అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరిలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
అంబేడ్కర్ జిల్లా అమలాపురంలో పర్యటిస్తున్న మంత్రి విశ్వరూప్‌కు ఛాతీలో నొప్పి రావడంతో కింద పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది, నాయకులు అప్రమత్తమై మంత్రి విశ్వరూప్ ను అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఓ ఆసుపత్రికి తరిలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు ప్రకటించారు. అమలాపురంలో వైఎస్‌ఆర్ వర్థంతి కార్యక్రమానికి హాజరైన సమయంలో మంత్రికి ఛాతీలో నొప్పి వచ్చింది. మంత్రి పినిపే విశ్వరూప్ అస్వస్థత గురించి తెలుసుకున్న ఆయన అనుచరులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లారు.
కొన్ని రోజుల కిందట అస్వస్థతకు గురై, హైదరాబాద్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న పినిపే విశ్వరూప్ అక్కడ తన నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం ముంబైకి వెళ్లాలని వైద్యులు సూచించారు. ముంబై వెళ్లగా ఏషియన్ హార్ట్ సెంటర్‌లో మంత్రి గుండెకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఆపరేషన్ సక్సెస్ అయిందని మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి తెలిపారు. కొన్ని రోజులకు తన సొంత ప్రాంతానికి వచ్చిన విశ్వరూప్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. తాను మళ్లీ యాక్టివ్ అయ్యానని, ప్రజా సేవకు పూర్తి సమయం కేటాయిస్తానని వీడియో కూడా రిలీజ్ చేయడం తెలిసిందే.