AP Temples : ఏపీలోని దేవాలయాల అభివృద్ధికి రూ.380 కోట్ల కేంద్ర నిధుల అంచనాల ప్రణాళిక సిద్ధం అయింది. ఈ మేరకు ప్రణాళిక నివేదికను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కేంద్రం మంత్రి కిషన్ రెడ్డికి అందించారు. దిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి కొట్టు సత్యనారాయణతోపాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ కుమార్ సింఘాల్, దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఏపీలోని దేవాలయాల అభివృద్ధికి రూ.380 కోట్ల నిధులు సమకూర్చే ప్రణాళిక వివరాలు అందించి వాటిపై ప్రజంటేషన్ ను సమర్పించారు. ఏపీలో ఏడు ప్రధాన దేవాలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ పథకం ద్వారా నిధులు అందించాలని కోరారు.
ఏడు ఆలయాలు ఇవే
ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల దేవాలయం అభివృద్ధికి రూ.80 కోట్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చిన తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆలయంలో మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేయటంతో పాటు భక్తులకు సదుపాయాలు కల్పన, మౌలిక వసతుల కోసం నిధులు వెచ్చించేందుకు దేవస్థానం అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ఇక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవాలయానికి కూడా రూ.80 కోట్లు నిధులు అవసరం అవుతుందని అంచనా వేశారు.రాహుకేతు పూజల కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఈ ఆలయాలని వస్తుంటారు. వీవీఐపీల తాడికి కూడా అధికంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా అభివృద్ది చేయాలని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయానికి రూ.50 కోట్ల ప్రణాళికలు రెడీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ దేవాలయానికి రూ.50 కోట్లు, విశాఖ జిల్లా సింహాచల లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి రూ.70 కోట్లు , కాకినాడ జిల్లా అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయానికి రూ.30 కోట్లు, విజయనగరం జిల్లా నెల్లిమర్ల రామతీర్థం దేవాలయానికి రూ.20 కోట్లు మొత్తంగా రూ.380 కోట్ల అంచనాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్ పథకం ద్వారా మంజూరు చేయాలని మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
ఆలయాల్లో శుద్ది కార్యక్రమాలు
ఉభయ గోదావరి జిల్లాలో వరదలు ఉద్ధృతంగా ప్రభావం చూపించాయి. దీంతో అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ఎండోమెంట్ అధికారులకు దేవాదాయ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలను శుభ్రం చేసి శుద్ధి కార్యక్రమాలు నిర్వహించాని ఆదేశించింది. వరద ఉద్ధృతి కారణంగా ఆలయాల్లో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. నీటిలో తడిసి ముద్దయిన దేవాలయాలన్నింటిలో వెంటనే క్లీనింగ్ , బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్, ధూప కార్యక్రమాలను వెంటనే పూర్తి చేసి, అర్చక, వేద పండితులతో శుద్ధి చేయాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.