జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి జోగి రమేష్ మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ పూటకో మాట మాట్లాడుతూ పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.


పవన్ పై జోగి కామెంట్స్...
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర ఇక అయిపోయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. మరోవైపు ఆయన తనయుడు నారా లోకేశ్‌ పాకులాడినా, ఇటు జనసేనాని పవన్‌ వారాహి ఎక్కి తిరిగినా వీరిలో ఏ ఒక్కరూ ఎన్నికల్లో గెలిచేది లేదని మంత్రి జోగి రమేష్ జోస్యం చెప్పారు.  పవన్‌ కళ్యాణ్‌ పూటకో మాట చెబుతూ తానేదో పెద్ద వ్యూహకర్తననే భ్రమల్లో బతుకుతున్నారని సెటైర్లు వేశారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ,  ఇంకో రోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండని ప్రజల్ని అడుక్కుంటున్నాడని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడే మాటలను విన్న ప్రజానీకం ఈ పిచ్చి వ్యాఖ్యలకు అర్థం ఏంటని మాట్లాడుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు.


పవన్ వైఖరి వలన అభిమానులు, అనుచరులు తలలుపట్టుకుని కూర్చున్నారని చెప్పారు.  2019లో పోటీ చేసిన రెండు చోట్ల ఓటర్లు, పవన్ ను  చాచి చెంప పగులకొట్టినట్టు ఓడించారని,  ఎమ్మెల్యేగా గెలవలేని పవన్  సీఎంగా గెలుస్తాడా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఇదే రీతిలో వారాహి ఎక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే  వచ్చే 2024 ఎన్నికల్లో కూడా తీవ్రమైన, ఘోరమైన అవమానంతో ఆంధ్ర రాష్ట్రం ముఖం కూడా చూడకుండానే పవన్ పారిపోవటం ఖాయమని జోగి రమేష్ అన్నారు.


రేపల్లె ఘటనపై రాజకీయమా...
పరామర్శ పేరుతో మాజీ సీఎం చంద్రబాబు  ఓట్లు అడుక్కుంటున్నారని మంత్రి జోగి రమేష్ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు  మతిభ్రమించింది కాబట్టే, రేపల్లె నియోజకవర్గం ఉప్పాలవారిపాలెంలో మృతి చెందిన అమర్నాథ్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి అక్కడ కూడా శవ రాజకీయం చేశాడని అన్నారు.  డర్టీ పాలిటిక్స్‌కు కేరాఫ్‌గా  చంద్రబాబు పేరు చెప్పుకోవాల్సిందేనన్నారు.  ఎవరైనా ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు బాధితుల్ని కలిసి వారితో మాట్లాడి వీలైతే సాయం చేసి ధైర్యం చెబుతారని, అయితే  దిక్కుమాలిన చంద్రబాబు మాత్రం అమర్నాథ్‌ సోదరి, తల్లిని కలిసి బయటకొచ్చి సభపెట్టి శవాలపై పేలాలేరుకున్నట్లు ఓట్లు అడుక్కున్నారని విమర్శించారు. కులాల్ని రెచ్చగొడుతున్న  తెలుగు దేశం పార్టి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోవటం ఖాయమని అంటున్నారు.  స్థానిక టీడీపీ ప్రబుద్ధులు శవరాజకీ యం చేసి కులాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, రేపల్లె నియోజకవర్గం చుట్టుప్రక్కల గ్రామాల వారు ఉప్పాలవారిపాలెంకు రావాలంటూ టీడీపీ వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టులు పెట్టారని అన్నారు. ఇది శవ రాజకీయం కాదా అని మంత్రి జోగి ప్రశ్నించారు. శవాల దగ్గర ఓట్లు అడుక్కునే నీచమైన బుద్ధి  టీడీపీకే ఉంటుందన్నారు. 


అమర్నాథ్ కుటుంబానికి అండగా ఉంటాం...
హత్యకు గురైన బాలుడు అమర్నాథ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉన్నామని మంత్రి జోగి రమేష్ తెలిపారు. విద్యార్థి అమర్నాథ్‌ హత్య జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం అన్నారు. సోదరిని కీచకుల వేధింపుల నుంచి కాపాడాలని ప్రయత్నించిన క్రమంలో అమర్నాథ్‌ హత్యకు గురవడం అందరిని బాధిస్తోందని మంత్రి జోగి రమేష్ ఆవేదన వెలిబుచ్చారు.  జరిగిన ఘోరంపై ప్రభుత్వ పరంగా హుటాహుటిన స్పందించటంతో పాటుగా,  కిరాతకానికి పాల్పడిన నలుగురు నిందితుల్ని కేవలం 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.  బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం జరిగిందని చెప్పారు. దీంతోపాటు  భాదిత కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘటన జరిగిన రోజునే స్థానిక ఎంపీ మోపిదేవి వెంకట రమణ బాధితుల ఇంటి కి వెళ్లి అండగా నిలిచారని చెప్పారు. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial