Minister Gudivada Amarnath : సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయనని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఐదు ప్రధానమైన శాఖల్లో తనకు బాధ్యత అప్పగించారన్నారు. చిన్న  వయసులో ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారన్నారు. తమ ఇంటిలో కుటుంబ సభ్యుడిగా ఆదరించి ఎయిర్ పోర్ట్ కి వచ్చి తనకు ఘనస్వాగతం పలికారని గుర్తుచేసుకున్నారు. సీఎం జగన్ తనకు గురుతర బాధ్యత అప్పగించారని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తానన్నారు. విశాఖను ఐటీ హబ్ గా మారుస్తానని ఆయన అన్నారు. విశాఖలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కష్ట పడితే కష్టానికి తగిన గుర్తింపు ఉంటుందని అనడానికి తానే నిదర్శనం అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. 




'ఒక్కసారి ఎంపీగా ఓడిపోయినా నాపై నమ్మకం ఉంచి ఈ రోజు ఉన్నత స్థానం లో నిలబెట్టారు.  ఉత్తరాంధ్ర ఇంఛార్జి విజయసాయి రెడ్డి ఆశీస్సులు కూడా ఉండడం ఈ ఉన్నత స్థానం దక్కింది. నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను.' అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 


మంత్రికి ఆర్జీవీ ట్వీట్


డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్నాథ్ ట్వి్ట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో గుడివాడ అమర్నాథ్ తిరిగి ఆర్జీవీకి ధన్యవాదాలు తెలిపారు. వర్మ ట్వీట్‌పై మంత్రి అమర్నాథ్ స్పందించారు. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. సీఎం జగన్ యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. వయసు 32 అయితే ఏముంది 37 అయితే ఏమిటని ఆర్జీవీకి ట్వీట్ చేశారు. తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా భవిష్యత్‌లో అందరి సహకారంతో కష్టపడి పనిచేసి ముందుకు వెళ్తానన్నారు. అంతకు ముందు వర్మ ట్వీట్ చేస్తూ చిన్న వయసులో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. 32 ఏళ్ల వయసులో మంత్రి పదవి సాధించారని, 82 ఏళ్లకు సాధిస్తే ఊహించుకోవడానికే ఏదోలా ఉండేదన్నారు.