AP Minister Botsa Satyanarayana: అమరావతి: అధికారం ముఖ్యం కాదని, తమకు నైతిక విలువే ముఖ్యమన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలో టీడీపీ (TDP), బీజేపీ, జనసేన పార్టీల పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు ఉన్నాయా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో ఓ చోట ఉన్న టీడీపీ సైతం ఈ ఎన్నికల తరువాత కనుమరుగు అవుతుందన్నారు. గతంలో బీజేపీని టీడీపీని ఎలా తిట్టారో రాష్ట్ర ప్రజలు చూశారు.. అదే విధంగా బీజేపీ నేతలు చంద్రబాబు (Chandrababu)ను కట్టప్పతో పోల్చడం నిజం కాదా అని ప్రశ్నించారు. అధికారం కోసం ఆ మూడు పార్టీలు వెంపర్లాడుతున్నాయని.. అందుకే కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, కట్టప్ప లాంటి నేత చంద్రబాబు అని బీజేపీ నేతలు విమర్శించిన వీడియోలను సైతం ఈ సందర్భంగా బొత్స ప్రదర్శించారు.


30 పార్టీలు పొత్తు పెట్టుకున్నా నో ప్రాబ్లమ్.. 
వైసీపీ ఏ పార్టీతోనూ పెట్టుకోదని, తమకు అలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు. 3 పార్టీలు కాదు, 30 పార్టీలు పొత్తు పెట్టుకున్నా వైసీపీని, జగన్‌ను ఏం చేయలేవన్నారు. బీజేపీతో కలిసిపోయారని గతంలో తమ పార్టీపై కొందరు దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు అదే పార్టీ బీజేపీతో జత కట్టిందని ఎద్దేవా చేశారు. తమకు ప్రజలతో మాత్రమే పొత్తు అని, వారి మద్దతుతో మరోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తామని.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే వైసీపీ విధానమని సీఎం జగన్ చెప్పిన మాటల్ని గుర్తుచేశారు.


దేశంలో అలాంటి ఏకైన సీఎం జగన్.. 
ప్రజల ఆశీస్సులతో ఏర్పాటైన ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేసిందన్నారు. వైసీపీ పాలనతో మీకు మేలు జరిగిందని, మీ కుటుంబం పరిస్థితి మెరుగు పడిందని భావిస్తే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్, ఉన్నత చదవులకు ఫీజు రీయింబర్స్ మెంట్ సహా పలు పథకాలు అమలుతో మీకు మేలు జరిగితేనే తమకు మద్దతు తెలపాలని కోరారు. రైతులకు ఆర్థిక సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి వారిని అన్ని విధాలుగా ఆదుకున్న నేత జగన్ అన్నారు. మా మేనిఫెస్టోలో పేర్కొన్న 95, 99 శాతం హామీలు నెరవేర్చాం, మరో ఛాన్స్ ఇస్తే మరింత మెరుగైన పాలన అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విధంగా ప్రజలకు వివరించి దేశంలో ఇలా ఓట్లు అడిగే ఒకేఒక్క నేత ఏపీ సీఎం వైఎస్ జగన్ అని మంత్రి బొత్స సత్యనారాయణ కితాబిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏమైనా ఆలోచించారా, ఏం ఆశించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.. ఏం హామీలు ఇచ్చారని ఎన్డీఏలో చేరారని చంద్రబాబును ప్రశ్నించారు.



దేశంలో, రాష్ట్రంలో గత వారం రోజులుగా పొత్తుల రాజకీయాలు జరుగుతున్నాయి. అధికారం దక్కించుకునేందుకు పొత్తుల కోసం కొన్ని పార్టీలు వెంపర్లాడుతున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పొత్తుల కోసం ఢిల్లీకి వెళ్లి, ఎదురుచూసి మరి బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం దారుణమన్నారు. రాజకీయాల్లో పొత్తులు సహజమేనని, కానీ చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నేత అయినా, ఈ స్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, చంద్రబాబు ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. గత ఎన్నికల్లో తమకు 151 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో వైసీపీ సీట్లు ఇంకా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.