AP Lands Resurvey : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వేకు అత్యాధునిక సాంకేతికను వినియోగించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. 52 డ్రోన్లతో సమగ్ర భూసర్వే నిర్వహిస్తున్నట్టు కమిటీ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా త్వరలో 172 డ్రోన్లు సమకూరుస్తామని మంత్రులు తెలిపారు. ఇప్పటివరకూ 2,149 గ్రామాల్లో డ్రోన్ల సాయంతో సర్వే పూర్తి చేశామని వివరించారు. భూసర్వే ప్రక్రియపై మంత్రుల కమిటీ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించింది.
భూ వివాదాల పరిష్కారానికి
ఈ సమావేశంలో భూసర్వే ప్రక్రియపై అధికారులు మంత్రులకు వివరాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 756 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ వ్యాలిడేషన్ ప్రక్రియ పూర్తి చేశామని అధికారులు కమిటీకి తెలిపారు. ప్రజల నుంచి 9,283 వినతలు వచ్చాయని, వాటిల్లో 8,935 సమస్యలు పరిష్కరించామన్నారు. సమగ్ర భూసర్వే ప్రక్రియలో 18,487 సర్వే రాళ్లను పాతి సరిహద్దులు నిర్ణయించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో 5,548.90 చ.కి.మీ. పరిధిలో 30 లక్షల నిర్మాణాలు ఉన్నాయన్నారు. దీంతో పాటు 13 జిల్లా కేంద్రాల్లో ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వాటితో సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తు్న్నట్లు మంత్రుల కమిటీకి తెలిపారు. భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా ఈ సర్వే పరిష్కారాన్ని చూపుతుందన్నారు. గ్రామీణ, పట్టణాల్లో నివాసాలు, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ సర్వే ద్వారా నిర్థారిస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది.
వందేళ్ల భూ రికార్డులు ప్రక్షాళన చేసేందుకు రీ సర్వే
ఆంధ్రప్రదేశ్ లో వందేళ్ల భూముల రికార్డులు తిరగరాసేందుకు సమగ్ర భూ రీసర్వే చేస్తోంది ప్రభుత్వం. భూ వివాదాలకు పరిష్కరించేందుకు సరిహద్దులు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుటుంది. ఇందులో భాగంగా అధునాతన టెక్నాలజీ, డ్రోన్లు సైతం వినియోగిస్తోంది. ఏడాదిగా సాగుతున్న భూముల రీసర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా గ్రామాల్లో పూర్తి సర్వే చేశారు. ేేమిగిలిన గ్రామాల్లో వేగంగా సర్వేను పూర్తి చేసేందుకు అధికారులు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. గతేడాది 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వే విజయవంతం అయింది. ఆ తర్వాత మరో 1,034 గ్రామాలను రీసర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. సర్వే ముగింపునకు సంబంధించిన నంబర్-13 నోటిఫికేషన్లు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఇంకా 598 గ్రామాల్లో ఈ నెలాఖరుకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 108 గ్రామాల్లో రీసర్వే పూర్తి అయింది. త్వరలో మరో 118 గ్రామాల్లో నోటిఫికేషన్లు అధికారులు జారీ చేయనున్నారు. డ్రోన్ల సాయంతో రెండు వేలకు పైగా సర్వే నిర్వహించారు.