Sabitha Indrareddy On Bandi Sanjay : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలపై ఆమె స్పందించారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ అంతర్గత సంఘర్షణ యాత్రగా మారిందని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో టీఆర్ఎస్ అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు బండి సంజయ్ కు ఓ అవకాశం కలిగిందన్నారు. మిషన్ భగీరథ నీళ్లు తాగి, పల్లె ప్రకృతి వనాల్లో సేద తీరి ఉంటారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంటుతో బండి సంజయ్ పాదయాత్ర ఇబ్బంది లేకుండా సాగిందన్నారు. పాదయాత్రలో ప్రజలు కేసీఆర్ చేసిన మేలు గురించి సంజయ్ కు స్పష్టంగా చెప్పారన్నారు. బీజేపీ కార్యకర్త చనిపోతే ఆ పార్టీ ఆదుకోలేదు కానీ సీఎం కేసీఆర్ రైతు బీమా ఆదుకుందని ఓ మహిళ సంజయ్ కు చెప్పారన్నారు. 






బండి సంజయ్ కు జ్ఞానోదయం అయిందా?


"కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ధరలు పెరిగాయని పాదయాత్రలో ప్రజలు బండి సంజయ్ ను నిలదీశారు. ఇప్పటికైనా సంజయ్ కు జ్ఞానోదయం అయింది అనుకుంటున్నాం. బీజేపీకి విధానాలు ముఖ్యం కాదని విద్వేషాలే ముఖ్యమని నెల రోజుల పాదయాత్రలో చేసిన ప్రసంగాలు చెబుతున్నాయి. అమిత్ షా రేపు తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణకు ఏం ఇవ్వలేదు, ఏం ఇవ్వబోమని చెప్పడానికి అమిత్ షా వస్తున్నారా? కేవలం చుట్టపు చూపుగా, పొలిటికల్ టూరిస్ట్ గా అమిత్ షా వస్తానంటే కుదరదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారా ఇవ్వరా అమిత్ షా చెప్పాలి. నవోదయ పాఠశాలలు తెలంగాణకు ఇచ్చేది లేదు చెప్పడానికి అమిత్ షా వస్తున్నారా? IIT, IIM, మెడికల్ కాలేజీలు తెలంగాణకు ఇవ్వబోమని చెప్పడానికి అమిత్ షా వస్తున్నారా? విభజన చట్టం హామీలు అమలు చేసేది లేదని చెప్పడానికి అమిత్ షా వస్తున్నారా? గ్యాస్ సీలిండర్ పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తామని రేపటి సభలో అమిత్ షా చెప్పగలరా? ప్రైవేట్ ఉద్యోగాల కల్పనలో ఉపయోగపడే ITIRను తెలంగాణ కు కేటాయిస్తున్నామని అమిత్ షా చెప్పగలరా? " అని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రశ్నించారు. 


ఊక దంపుడు మాటలు కాదు, ఏమిచ్చారో చెప్పండి 


కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు ఏం మాట్లాడతారో ఊహించగలమని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఊక దంపుడు మాటలు మాట్లాడి వెళ్లిపోవడం కాదు, తెలంగాణకు ఏం చేస్తారో అమిత్ షా చెప్పాలని నిలదీశారు. విద్వేషాలు రెచ్చ గొట్టడానికి కాదు, విధానాలు చెప్పడానికి అమిత్ షా రావాలని సూచించారు. బీజేపీ సభ పెట్టే తుక్కుగూడా పరిసర ప్రాంతాలే చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తెలుస్తుందన్నారు. తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం ఏమిచ్చిందో సంజయ్ శ్వేత పత్రం విడుదల చేస్తే, మహేశ్వరం అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. 


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ తెలంగాణకు ఇస్తామని చెప్పారని, కానీ అది గుజరాత్ కు తరలి వెళ్లిందన్నారు. కిషన్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు లేవో అమిత్ షా చెప్పాలన్నారు. గుజరాత్ లో ప్రజలు తాగు నీటికి అల్లాడుతున్నారని మంత్రి సబితా ఆరోపించారు. యువతను చెడగొట్టే మాటలు మాట్లాడొద్దని బీజేపీ నేతలకు మంత్రి సూచించారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, తెలంగాణకు ITIR ను కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.