ఇంటర్లో చేరాలా.....అయితే మీరు కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..




కరోనా ప్రభావం పడని రంగంలేదు. విద్యావ్యవస్థపై అంతకుమించి అనేంత ప్రభావం ఉంది. ఆన్ లైన్ చదువులు...పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోషన్లు...ఇదీ పరిస్థితి. ఈ సంగతంతా సరే...పదో తరగతి పాసైన విద్యార్థులంతా నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో పడ్డారు. దీనికి సమాధానంగా  ఆంధ్రప్రదేశ్ లో  2021–22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు సన్నాహాలు చేపట్టింది.  పూర్తి పారదర్శకతతో.. మెరిట్‌ ప్రాతిపదికన విద్యార్థులు కోరుకున్న కళాశాలలో, నచ్చిన గ్రూపులో సీటు పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. 




ప్రైవేట్ కళాశాలల ఆగడాలకు చెక్
ఆన్‌లైన్‌ ప్రవేశాలకు వీలుగా గతేడాది ఇంటర్‌ బోర్డు ఎన్నో సంస్కరణలు చేపట్టింది. కొత్త కాలేజీల అనుమతులు, రెన్యువల్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం ప్రవేశపెట్టింది. ప్రతి కాలేజీ నిర్వహించే గ్రూపులు, సెక్షన్ల వారీగా ఎన్ని తరగతి గదులు ఉండాలి? ఒక్కో గది ఎంత వైశాల్యంలో ఉండాలి?  అనే  ప్రమాణాలు నిర్దేశించింది. ఆ గదులతో సహా భవనాలు, మరుగుదొడ్లు, ఆటస్థలం ఫొటోలను దరఖాస్తుతోపాటే బోర్డు వెబ్‌సైట్‌లో పెట్టించింది. అంతేకాకుండా ఈ ఫొటోలను జియోట్యాగింగ్‌ చేయించింది. ఎందుకంటే...కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఓ భవనాన్ని చూపించి మరో భవనంలో తరగతులు నిర్వహిస్తుంటారు. కానీ ఇప్పుడు జియో ట్యాగింగ్ వల్ల చూపిస్తున్న భవనాలు దరఖాస్తులో పొందుపరిచిన  అడ్రసులో ఉంటేనే అనుమతులిస్తున్నారు. ఆ ఫొటోలన్నీ కళాశాల వెబ్ సైట్స్ లో విద్యార్థులు, తల్లిదండ్రులు చూసేలా అందుబాటులో ఉంచింది. అక్కడున్న గ్రూపులు, సిబ్బంది వివరాలు కూడా అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేసింది.




అడ్మిషన్ల కోసం ప్రత్యేక పోర్టల్‌
మొన్నటి వరకూ కళాశాలల్లో సెక్షన్ కి 80 మంది వరకూ అనుమతించేవారు. కానీ సీబీఎస్‌ఈ విధానంలో  ఆ లెక్క సగానికి తగ్గి  40కి చేరింది.  గరిష్టంగా 9 సెక్షన్ల వరకు మాత్రమే అనుమతిచ్చేలా నిబంధన పెట్టింది. కొన్ని కళాశాలలు కేవలం సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రమే నిర్వహిస్తుండడంతో .. ఎంపీసీ, బైపీసీతోపాటు హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు కూడా ప్రవేశపెట్టాల్సిందేనని సర్కార్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు కళాశాలల వారీగా కోర్సులు, సీట్ల సమాచారాన్ని ఆన్ లైన్ అడ్మిషన్లకు అనుగుణంగా  వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.  ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా రూపొందించింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్లతో ప్రైవేటు కాలేజీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మహిళలు, క్రీడాకారులకు సంబంధించిన కోటా సీట్లు వారితోనే భర్తీ కానున్నాయి. దీంతో ప్రైవేటు కళాశాలల అక్రమాలకు చెక్ పడనుంది.


ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఇలా చేసుకోండి...



  • వెబ్‌సైట్‌లో పదో తరగతి హాల్‌టికెట్‌ నంబర్, పాసైన సంవత్సరం, బోర్డు, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్‌ నంబర్, ఈమెయిల్‌ ఐడీ, పుట్టిన తేదీ, చదివిన స్కూల్, కులం, ఆధార్‌ నంబర్ల వివరాల ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

  • ఆ రిజిస్ట్రేషన్‌ ఐడీ పాస్‌వర్డ్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి. 

  • విద్యార్థి పూర్తి చిరునామా, మొబైల్‌ నంబర్‌ నమోదు చేశాక జిల్లాలు, కాలేజీలు, మాధ్యమాల వారీగా గ్రూపులతో వివరాలు కనిపిస్తాయి. 
    తమకు నచ్చిన గ్రూపు, కాలేజీకి ప్రాధాన్య క్రమంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 

  • విద్యార్థి రిజర్వేషన్, పదో తరగతిలో ప్రతిభ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లను బోర్డు కేటాయిస్తుంది.

  • విద్యార్థి మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌ రూపంలో దాన్ని తెలియచేస్తుంది. 

  • అలాట్‌మెంట్‌ లెటర్‌ను పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని కేటాయించిన కాలేజీలో చేరాలి

  • పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయించిన ఫీజును ఆ కాలేజీకి ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా చెల్లించాలి

  • విద్యార్థి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కాలేజీలో సమర్పించాల్సిన అవసరం లేదు.

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులోనే ఆయా సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేయించి ఇంటర్‌ బోర్డే వాటిని ఆన్‌లైన్‌లో పరిశీలిస్తుంది. 




ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ కాలేజీల్లో ఫస్టియర్‌లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఇంటర్‌ బోర్డు గత విద్యా సంవత్సరంలోనే శ్రీకారం చుట్టింది.  ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు నిర్వహించేందుకు లైన్‌క్లియర్‌ కావడంతో బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.