Big Alert to AP Politicians: ఆంధ్రప్రదేశ్ రాజకీయం మాంచి రంజుగా సాగుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు - ప్రతి విమర్శలతో వాడి వేడిగా నడుస్తోంది. మూడు విమర్శలు, ఆరు తిట్లతో ఏపీ రాజకీయం సాగుతోంది. రాజకీయ రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల నిరంతరం మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కొన్ని రోజుల క్రితం విశాఖ పట్నం ఎయిర్ పోర్టు వద్ద ఆంధ్రప్రదేశ్ మంత్రులపై జనసేని పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు,పవన్ కల్యాణ్ అభిమానులు దాడి చేసిన సంగతి తెలిసిందే. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. మంత్రుల కాన్వాయ్ లోని కార్లను ధ్వంసం చేశారు. కార్ల అద్దాలు పగుల గొట్టారు. వేలాది మంది జనసేన మద్దతు దారులు అలా విరుచుకు పడటంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. 


దాడులు - ప్రతిదాడులు


మంత్రులపై హత్యాయత్నం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు గానూ వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 9 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో వారికి బెయిల్ వచ్చినప్పటికీ.. ఆ వివాదం మాత్రం రోజు రోజుకూ ముదురుతూనే వస్తోంది. ఈ ఘటన అనంతరం పవన్ కల్యాణ్ ఓ సభ చేసిన వ్యాఖ్యలపై వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. చెప్పుతో కొడతానంటూ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ వర్గీయులు.. శ్రీకాకుళం జిల్లాలోని జనసేన కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ఎదురు దాడికి దిగారు. దీంతో శ్రీకాకుళంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 


ఇప్పట్లో ఆగేలా కనిపించని దాడులపర్వం


పోలీసులు రంగ ప్రవేశం చేసి అప్పటికి సద్దుమణిగేలా చేసినప్పటికీ.. ఈ దాడులు ఇప్పట్లో మాత్రం ఆగేలా కనిపించడం లేదు. ఒక పార్టీకి చెందిన వారిపై మరొక పార్టీకి చెందిన వ్యక్తులు దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. మంత్రులు, వైఎస్సార్ సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై, వారి ఇళ్లపై దాడులు జరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలపై మాత్రమే కాకుండా, పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులపై కూడా దాడులు జరగవచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


కేవలం జనసేన, వైఎస్సార్ సీపీ పార్టీల మధ్యే కాకుండా, ఇతర పార్టీల మధ్య కూడా రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. వైసీపీ -  తెలుగు దేశం పార్టీ, వైసీపీ -  జనసేన అనేలా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా.. రాజకీయం మాత్రం ఎన్నికల వేళ ఉన్నంత హాట్ హాట్ గా ఉన్నాయి. అన్ని పార్టీల నాయకులు తిట్ల దండకాలు లంకించుకుంటూ రాజకీయాలు అంటేనే ఏవగింపు అనుకునేలా తయారు చేస్తున్నారని సామాన్య ప్రజల నుండి రాజకీయ నిపుణుల వరకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.