ఉపాధి హామీ పథకం నిధుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూండటంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని సార్లు ఆదేశించినా బిల్లులు చెల్లించకపోతూండటంపై మండిపడింది.  రెండు వారాల్లో బిల్లులు చెల్లించి హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.  బిల్లులు చెల్లించకపోవడం అంటే పిటిషనర్ల జీవించే హక్కును హరించడమేనని  న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అంటే గౌరవంతో జీవించడమని...  చేసిన పనులకు బిల్లులను చెల్లించమని హైకోర్టు ఇప్పటికే చెప్పినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.  పనులు చేసేందుకు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక   ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక కాంట్రాక్టర్లు ఇబ్బందిపడుతున్నారని వ్యాఖ్యానించారు. 


కేంద్ర ప్రభుత్వం తాము నిధులన్నీ చెల్లించామని చెబుతోంటే.. రాష్ట్ర ప్రభుత్వం రాలేదని చెబుతోందని   హైకోర్టు  అసహనం వ్యక్తం చేసింది.  గతంలో బిల్లులు చెల్లిస్తామని ఏజీ హామీ ఇచ్చినప్పటికీ చెల్లింపులు జరగకపోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ..ఎప్పటికప్పుడు కేసు వాయిదా వేయించుకునేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది.   బిల్లులు చెల్లించడం అంటే పంచాయతీ ఎకౌంట్లలో డబ్బులు వేయడం కాదని .. పిటిషనర్ల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేసింది.  చెల్లించకుండా జాప్యం చేయడం క్షమించరాని అంశమని స్పష్టం చేసింది.  రెండు వారాల్లోపు 500 మంది పిటిషనర్లకు డబ్బు చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేరస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి సంవత్సరం 2018-19 ఏడాదిలో ఉపాధి హామీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. అక్రమాల పేరుతో  ఓ సారి నిధులు కేంద్రం నుంచి రాలేదని మరోసారి కారణాలు చెబుతూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. వారంతా  హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఏడాదిన్నర కిందటి నుంచి ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఏడాదిన్నర నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ చెల్లించడం లేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వారాల్లో చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది.


ఈ అంశంపై రాజకీయంగానూ దుమారం రేగుతోంది. పనులు చేసిన వారిలో ఎక్కువ మంది టీడీపీ సానుభూతి పరులు ఉండటంతో వారికి మద్దతుగా టీడీపీ కూడా ఆందోళన చేపట్టింది. పలుమార్లు ధర్నాలు, దీక్షలు చేశారు. కలెక్టరేట్లను ముట్టడించారు. అయినా ప్రభుత్వం మాత్రం దిగి రాలేదు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో అయినా  తమకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తుందేమోనన్న ఆశతో వారు ఉన్నారు.