Narayana Highcourt :  మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది.  రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కొనుగొలు అక్రమాలు జరిగాయని సీఐడీ నమోదు చేసిన కేసులో  తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.  41ఏ నిభందనలు అనుసరించాలని సీఐడీ పోలీసులకు స్పష్టం చేసింది. నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై  మధ్యంతర ఉత్తర్వులు దాఖలు చేసిన హైకోర్ట్ తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. 


గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన యలమర్తి ప్రసాద్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో సీఐడీ అధకారులు నారాయణను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. నిందితులు ఎస్సీలకు ద్రోహం చేశారని, వారి అసైన్డ్ భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కు రాజ‌ధాని రాక‌ముందే కొనుగోలు చేశారని ప్రసాద్ కుమార్ ఆరోపించారు. అప్పుడు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా ఉన్న నారాయణ ఆదేశాల మేరకు నిందితులు ల్యాండ్‌ పూలింగ్‌పై ఎస్సీల్లో భయాందోళనలు సృష్టించారని ఫిర్యాదులో ఆరోపించారు.                          


అమరావతిలో 1,100 ఎకరాల అసైన్డ్‌ భూముల్లో అక్రమ లావాదేవీలు చోటుచేసుకున్నాయని సీఐడీ తెలిపింది. 169.27 ఎకరాల ఎసైన్డ్‌ భూములకు సంబంధించి నారాయణ, ఆయన కుటుంబసభ్యులు, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య రూ.15 కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిచినట్లు దర్యాప్తులో గుర్తించినట్టుగా కేసుగా మోదు చేసింది.   ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా మాజీ మంత్రి నారాయణ ఆయ‌న కుటుంబ స‌భ్యులు, బంధువులు ఉన్నార‌న్న సీఐడీ ఈ లావాదేవీలు బినామీ రూపంలో జ‌రిగాయ‌ని తెలిపింది.                                                                                    


రాజ‌ధాని గ్రామాలైన అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంటకపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 89ఎకరాల 8గుంటల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణా హౌసింగ్‌ డైరెక్టర్‌ ఖాతాల ద్వారా కొన్ని లావాదేవీలు జ‌రిగాయ‌ని నిర్ధారించిన‌ట్టు సీఐడీ పేర్కొంది. ఈ కేసులో మరో ఐదుగుర్ని అరెస్ట్ చేసిన వారిని కోర్టు రిమాండ్‌కు పంపేందుకు తిరస్కరించింది. నమోదు చేసిన సెక్షన్లు సరి కాదని చెప్పి 41 ఏ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.                    


ఇప్పుడు నారాయణకు కూడా హైకోర్టు 41ఏ నిబంధనలు పాటించాలని ఆదేశించడంతో  ఆయనను కూడా అరెస్ట్ చేయాలనుకున్న సీఐడీ ప్రయత్నాలు విఫలమయ్యాయని  టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.