ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్ రానున్న వేళ ప్రస్తుత గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ కు ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. విజయవాడలోని బందరు రోడ్డులోగల ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గవర్నర్ కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గవర్నర్‌ వ్యవస్థకు బిశ్వభూషణ్ నిండుతనం తెచ్చారని కొనియాడారు. రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారని అన్నారు. గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం అన్నారు.


ఒక తండ్రిలా, రాష్ట్రానికి పెద్దలాగా ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని ప్రశంసించారు. గవర్నర్‌ విద్యావేత్త, న్యాయ నిపుణులు, స్వాతంత్ర్య సమరయోధులని గుర్తు చేశారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఒడిశా బార్‌ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషించారని ప్రస్తావించారు. గవర్నర్‌ వందేళ్లూ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని సీఎం జగన్ కోరుకున్నారు. బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రజలు, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు.


గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ తనపట్ల చూపిన గౌరవం, ఆప్యాయత మర్చిపోలేనని గవర్నర్‌ మాట్లాడారు. ఏపీ ప్రజలు అందరికీ సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. గవర్నర్‌, సీఎం సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తన రెండో ఇల్లు లాంటిదని అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మర్చిపోబోనని అన్నారు.


తాను గవర్నర్ గా ఏపీకి వచ్చిన కొత్తలో ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని జగన్ ను ప్రశ్నించానని, దేవుడి దయతో అన్నీ పూర్తవుతాయని సీఎం జగన్‌ చెప్పారని గుర్తు చేసుకున్నారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుందని కొనియాడారు. ప్రజలు అందించిన ప్రేమ, అభిమానం, సహకారం ఎంతో అద్భుతమైనదని.. కరోనా కాలంలో ఏపీలోని వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని గుర్తు చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నా రెండో ఇల్లు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీ ప్రజలను మరవను’’ అని గవర్నర్‌ మాట్లాడారు.


బిశ్వభూషణ్ హరిచందన్ ఒడిషా రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఆయన న్యాయవాది, కవి, రచయిత, యాక్టివిస్ట్. 2019 జూలై 17 న ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్టానికి గవర్నరుగా నియమితులు అయ్యారు. మూడున్నర సంవత్సరాల పాటు ఆయన ఏపీ గవర్నర్‌గా పని చేశారు. బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే.


ఒడిశాలోని ఖుర్దాకు చెందినవారు బిశ్వభూషణ్. ఆయన 1934 ఆగస్టు 3న జన్మించారు. ఆయనకు జనసంఘ్ తో దశాబ్దాల అనుబంధం ఉంది. ఒడిశాలో ‘సంఘ్‌’ కార్యకలాపాలు విస్తరించేందుకు అతను 1964లో అక్కడ భారతీయ జనసంఘ్‌ శాఖను ఏర్పరిచారు. స్వయం సేవకుడుగా ఉన్న ఆయన జనసంఘ్ లో చేరి చురుకుగా పని చేశారు. జనసంఘ్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. 1975లో ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళనలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. 1977లో జన్‌సంఘ్‌ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో హరిచందన్‌ ఒకరు. ఇప్పటిదాకా రెండుసార్లు జనతా పార్టీ టికెట్‌పై, మూడుసార్లు భారతీయ జనతా పార్టీ తరఫున మొత్తం ఐదుసార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. రెవెన్యూ, న్యాయ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1980 నుంచి ఎనిమిదేళ్లపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత జనతా పార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1996లో ఆయన తిరిగి బీజేపీలోకి వచ్చేశారు.