గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గలేదు. సోమవారం సాయంత్రం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగినప్పటి నుంచి పరిస్థితి చాలా హాట్‌హాట్‌గా ఉంది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌లో పోలీసులు ఉన్నారు. 


ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన టీడీపీ నేత పట్టాబి గన్నవరంలో పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. పట్టాబి, చిన్నా తోపాటు మరో పదిమందిని పోలీసులు తమ కస్టడీలో ఉంచినట్టు సమాచారం. తన భర్త ఆచూకీ చెప్పాలని లేకుంటే డీజీపీ ఆఫీస్‌ ఎదుట ఆమరణ దీక్ష చేస్తానంటూ అల్టిమేటం ఇచ్చారు. ఇంటి నుంచి బయల్దేరిన ఆమెను పోలీసులు మార్గమధ్యలోనే అరెస్టు చేసి ఇంటికి తరలించారు. ఇంట్లో నుంచి రాకుండా నిర్బంధించారు. 


పోలీసులు నిర్బంధించడంతో పట్టాబి భార్య చందన తన ఇంట్లోనే దీక్ష చేస్తున్నారు. ఆమెకు సంఘీభావం తెలిపేందుకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఫోన్ చేశారు. ఆమెకు ధైర్యం చెప్పారు. అవసరమైతే కొత్త గవర్నర్‌ నజీర్‌ను కలిసి వినతి పత్రం ఇస్తామన్నారు. 


పోలీసు పహారాలో ఉన్న గన్నవరంలో నేతల మధ్య ఆరోపణలు, సవాళ్లు ఆగడం లేదు. వంశీ చేస్తున్న దశ్చర్యలను అడ్డుకుంటున్న తమపై జులుం ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమా ఆరోపించారు. వంశీ చేస్తున్న అవినీతిని అడగడం తప్పా అని ప్రశ్నించారు. రౌడీ చేస్తున్న ఆగడాలను అడ్డుకోవాల్సిన పోలీసులు తమను అడ్డుకోవడమేంటని నిలదీశారు. చేతకాకుంటే పోలీసులు తప్పుకోవాలని సూచించారు బొండా ఉమా. 


సోమవారం సాయంత్రం గన్నవరంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఆఫీస్ ముందు ఉన్న కారుకు నిప్పుపెట్టారు. ఎమ్మెల్యే వంశీపై టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ఆగ్రహంతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారు. వైసీపీ కార్యకర్తలు విజయవాడ రూరల్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కోనేరు సందీప్ వాహనాన్ని తగలబెట్టారు దుండగులు. వంశీపై టీడీపీ నేత దొంతు చిన్నా నిన్న విమర్శలు చేశారు. దీంతో వంశీ అనుచరులు దొంతు చిన్నా ఇంటిపై దాడి చేశారు.