‘వద్దురా సోదర పెళ్ళంటే నూరేళ్ళ మంటరా’ అని సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ఇది ఈ వ్యక్తికి సరిగా సరిపోతుంది ఏమో. ఎందుకంటే ఇప్పుడు అతని పరిస్థితి అలాగే ఉంది మరి. అందుకు కారణం.. ఎవరో చేసిన తప్పులు కాదు, స్వయానా వరుడు చేసిన తప్పులే అతని పెళ్లిని నరకంగా మార్చేశాయి. జీవితంలోని అత్యంత సంతోషకరమైన రోజుగా తన పెళ్లి రోజు మారుతుందని ఆశపడ్డాడు. కానీ చివరికి అది భయంకరమైన రోజుగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
పెళ్లి అంటే అందరికీ అదొక మధురమైన జ్ఞాపకం. కానీ అతడికి మాత్రం జీవితంలో మరచిపోలేని చేదు సంఘటన. చైనాలోని యునాన్ ప్రావిన్స్ కి చెందిన చెన్ సాంగ్ కి ఫిబ్రవరి 6వ తేదీన పెళ్లి జరిగింది. చెన్ పెళ్లి కాకముందు కొంతమంది అమ్మాయిలతో ప్రేమాయణం నడిపాడు. వాళ్ళందరిని వదిలేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ గర్ల్ ఫ్రెండ్స్ ఊరుకుంటారా? అస్సలు వదిలిపెట్టలేదు. అతడి పరువుని దారుణంగా తీసేశారు. ‘‘మేము చెన్ సాంగ్ మాజీ గర్ల్ ఫ్రెండ్స్. ఈరోజు మేము నిన్ను నాశనం చేస్తాం’’ అని రాసి ఉన్న పెద్ద ఎరుపు రంగు బ్యానర్ పట్టుకుని పెళ్లి వేదిక దగ్గర ప్రత్యక్షమయ్యారు. రోడ్డు మీద నిలబడి చెన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చాలా మంది అది చూసి చెన్ ఫ్రెండ్స్ తనని ఆట పట్టించడానికి అలా చేశారేమో అని అనుకున్నారు. కానీ అది చెన్ మాజీ గర్ల్ ఫ్రెండ్స్ చేసిన పని అని తెలుసుకుని నోరెళ్ళబెట్టారు. చెన్ వివాహం జరిగే ప్రదేశం దగ్గర అడ్డంగా మహిళలు నిలబడి అతన్ని చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది అయితే ఆ అమ్మాయిలు చేసే హడావుడి ఏంటో కనుక్కోవాలని తెగ ఆరాటపడిపోయారు. చివరికి అందరితో పాటు వధువు కూడా వాళ్ళ దగ్గరకి వెళ్ళి అసలు విషయం తెలుసుకుంది. ఈ ఘటన తనని చాలా ఇబ్బంది పెట్టిందని చెన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన కొత్త భార్య, ఆమె కుటుంబం తనతో మాట్లాడటం కూడా లేదని వాపోతున్నాడు.
మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వరుడు గతంలో తన మాజీ ప్రియురాళ్ళలో కొంతమందితో చెడుగా ప్రవర్తించానని అంగీకరించాడు. అయితే వయస్సు పెరిగే కొద్ది తన బుద్ధి మార్చుకున్నా అని చెప్పుకొచ్చాడు. జరిగిన గొడవలకు సరైన వివరణ ఇచ్చుకుంటేనే క్షమిస్తానని భార్య ఖరాఖండీగా తేల్చి చెప్పేసింది. తమకి సంతృప్తి కరమైన వివరణ ఇచ్చేవరకు మాట్లాడేది లేదని చెన్ తో ఇంటి సభ్యులేవరూ మాట్లాడటం లేదు. అవన్నీ చిన్న వయస్సులో తెలియక చేసిన తప్పులని, అందుకే గతంలో మాజీ గర్ల్ ఫ్రెండ్స్ ని బాధపెట్టినట్టు ఒప్పుకున్నాడు. చెన్ తన గత ప్రవర్తనకి చింతిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. బుద్ధి తెచ్చుకున్నాక స్త్రీల పట్ల గౌరవంగా ఉండమని ఇతరులకు సలహా ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తే ఏం ప్రయోజనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఇక జీవితాంతం పెళ్ళాం చేతిలో అతడికి దెబ్బలేనేమో..!
Also Read: మధుమేహం వల్ల వచ్చే అంధత్వాన్ని అడ్డుకోవచ్చు, ఇవిగో ఆయుర్వేద చిట్కాలు