మధుమేహం కళ్ళతో సహా శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. అవి పూర్తిగా దెబ్బతినేలా చేస్తుంది. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అని కూడా పిలుస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేనప్పుడు కళ్ళను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రెటీనా వెనుక భాగంలోని రక్త నాళాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య వస్తుంది. డయాబెటిక్ రెటినోపతిలో తేలికపాటి దృష్టి సమస్యలు వస్తాయి. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించవు కానీ గుర్తించకపోతే మాత్రం శాశ్వత అంధత్వానికి దారితీస్తుంది.


సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం డయాబెటిస్ ఉన్నవారిని ప్రభావితం చేసే కంటి వ్యాధులు మాక్యులర్ ఎడెమా, కంటిశుక్లం, గ్లకోమా. ఇవన్నీ కంటి చూపు పూర్తిగా పోయేలా చేస్తాయి. ముందస్తుగా గుర్తించి చికిత్స చేసుకుంటే కంటి చూపును రక్షించుకోవచ్చు.


డయాబెటిక్ రెటినోపతి దశలు


ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.2 బిలియన్ల మంది ప్రజలు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వారిలో 3 మిలియన్ల మందికి డయాబెటిక్ రెటినోపతి ఉంది.


ప్రారంభదశ: నాన్-ప్రొలిఫెరేటివ్ అని కూడా పిలుస్తారు. రెటీనాలోని రక్తనాళాల గోడలు బలహీనపడతాయి. రక్తం, ఇతర ద్రవాలు లీక్ అవడం వల్ల దృష్టి సమస్యలకు కారణంఅవుతుంది.


అడ్వాన్స్డ్ స్టేజ్: ఇది రేటినాలో కొత్త రక్తనాళాలు పెరిగేలా చేస్తుంది. పెళుసుగా మారుతుంది. రక్తస్రావం అవుతుంది. కంట్లో బ్లాక్ స్పాట్ లు వస్తాయి. రక్తస్రావం ఎక్కువ అయితే కంటి చూపు శాశ్వతంగా పోతుంది.


సంకేతాలు, లక్షణాలు


డయాబెటిక్ రెటినోపతి ప్రారంభదశలో ఎటువంటి లక్షణాలు గుర్తించలేరు. కానీ అడ్వాన్స్డ్ స్టేజ్ లో కనిపించే వివిధ లక్షణాలు..


⦿మసక మసకగా కనిపించడం


⦿కంటిలో డార్క్ స్పాట్స్


⦿రంగులు గుర్తించలేకపోవడం


⦿దగ్గరగా ఉన్నవి కూడా కనిపించకపోవడం


⦿కళ్ళలో నొప్పి


⦿చదవడంలో ఇబ్బంది


ఆయుర్వేదం ద్వారా చికిత్స


ఆయుర్వేదం ప్రకారం దీన్ని ప్రమేహ అని కూడా పిలుస్తారు. డయాబెటిక్ రెటినోపతి వివిధ దశలలో కంటికి సంబంధించి మూడు దోషాలను కలిగి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటికి ప్రధాన కారకాలు మానసిక ఒత్తిడి, ఆహారం. ఈ సమస్యని అధిగమించేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం తీసుకోవడం ఉత్తమ మార్గాలని నిపుణులు అంటున్నారు. ఆయుర్వేద మందులు డయాబెటిక్ రెటినోపతి నిరోధించగలవు.


ఉసిరి: ఉసిరి మధుమేహులకు అద్భుతమైనది. రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ డైట్ విషయానికి వస్తే ఆహారంలో ఉసిరి రసం, ఉసిరికాయ మురబ్బా, పొడి, పచ్చడిగా తీసుకోవచ్చు.


గిలోయ్: మామిడి, వేప వంటి పెద్ద చెట్ల మీదకి గిలోయ్ తీగ మొక్క పాకుతుంది. ఇది చేదు రుచిని కలిగి ఉంటుంది. కఫ, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ పైరేటిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి.


త్రిఫల చూర్ణం: మూడు ఫలాల తో చేసే త్రిఫల చూర్ణం మధుమేహులకు చాలా మేలు చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగొచ్చు.


జీవనశైలిలో మార్పు: ప్రాణాయమ పద్ధతులు అనుసరించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కంటి చూపుని మెరుగుపరచడానికి యోగా చక్కగా పని చేస్తుంది. ఇందులో భాగంగా మంట, చంద్రుడు, సూర్యుని కాంతి చూడటం వంటివి చేయాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.