Lokesh Hihgcourt : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఢిల్లీకి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు లోకేష్ విచారణను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. లోకేష్ సిఐడీ విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తూ సిఐడీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ ఇచ్చిన లంచ్ మోషన్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్ లో షేర్ హోల్డర్ మాత్రమేనని లోకేష్ తరపు న్యాయవాదులు వాదించారు.
ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని ... లోకేష్ ను ఇవి అడగడం సమంజసం కాదని సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాము డాక్యుమెంట్ల పై ఒత్తిడి చేయబోమని, బుధవారమే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. అయితే అంత తొందర ఏముందని లోకేష్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని ... న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సిఐడీకి హైకోర్టు ఆదేశించింది.
అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల భూముల విలువను పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ ను అప్పటి సీఎం చంద్రబాబు మార్చారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ారెడ్డి ఫిర్యాదు మేరకు గత ఏడాది ఐపీసీ, అవినీతి నిరోధకచట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్ కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పలువురిని ఎఫ్ఐఆర్ లో చేర్చింది.
ఇటీవల ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో నిందితుడిగా లోకేశ్ పేరును చేర్చింది. ఏ 14గా నారా లోకేష్‌ను చేర్చిన సీఐడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. టీడీపీ యువనేత నారా లోకేశ్ కూడా అరెస్ట్ అవుతారంటూ వైసీపీ శ్రేణులు కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నాయి.ఈ క్రమంలో నారా లోకేష్ న్యాయపోరాటం ప్రారంభించారు. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. తమపై నమోదు చేసినవన్నీ తప్పుడు కేసులనీ... ఒక్క ఆధారం లేకపోయినా.. కావాలనే కేసులు పెడుతున్నరని లోకేష్ ఆరోపిస్తున్నారు.