స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ లో మరికొన్ని అదనపు షరతుల విషయంలో సీఐడీ అనుబంధ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ ర్యాలీలో పాల్గొనొద్దని, కేసు అంశాలపై మీడియాతో మాట్లాడొద్దని, గతంలో ఇచ్చిన ఆదేశాలనే కొనసాగించాలని స్పష్టం చేసింది. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.


కాగా, స్కిల్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే, రాజకీయ ర్యాలీలు, మీడియా సమావేశాల్లో పాల్గొనకూడదని కొన్ని షరతులు విధించింది. ఈ క్రమంలో ఆయనకు మరిన్ని షరతులు విధించాలని సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చినందున ఆరోగ్య పరీక్షలు, చికిత్సకు మాత్రమే పరిమితమయ్యేలా షరతులు విధించాలని కోరింది. చంద్రబాబు కార్యకలాపాలను పరిశీలించేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను ఆయన వెంట ఉండేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో పేర్కొంది.


సీఐడీ ఏం చెప్పిందంటే.?


చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో విడుదలైన రోజు ఆయన కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారని, రాజమండ్రి జైలు బయట మీడియా సమావేశం నిర్వహించారని సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం ర్యాలీగా వెళ్లారని ఆరోపిస్తూ సంబంధిత ఆధారాల్ని కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.


సీఐడీ వాదనపై అభ్యంతరాలు


అటు, సీఐడీ లాయర్ వాదనపై చంద్రబాబు తరఫు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలని కోరడం వెనుక ఇతర కారణాలున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. నేర నిరూపణకై, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సైతం ప్రాథమిక హక్కులుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు.


ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై విధించిన షరతుల విషయంలో గతంలో ఆదేశాలనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. 


నేడు చంద్రబాబు డిశ్చార్జి


మరోవైపు, వైద్య పరీక్షల నిమిత్తం ఏఐజీ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు నేడు డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది. వైద్యుల సూచనతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఏఐజీకి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కె.రాజేష్ ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్ తో పాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన వైద్య బృందం ఆయనకు వివిధ వైద్య పరీక్షలు సూచించారు. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీ, ఎకో, కాలేయ, కిడ్నీల పని తీరు, అలర్జీ స్క్రీనింగ్ ఇతర టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఏఐజీ నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లే అవకాశం ఉంది. అక్కడే ఆయన కాటరాక్ట్ సమస్యకు వైద్యులు శస్త్ర చికిత్స చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 


Also Read: Supreme Court: జగన్ కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు - ఎంపీ రఘురామ పిటిషన్ పై విచారణ వాయిదా