Pawan Kalyan Acting In Movies | అమరావతి: సినిమాల్లో నటించడంపై ముఖ్యమంత్రులు,  మంత్రులు, ప్రజా ప్రతినిధులపై ఎలాంటి నిషేధం లేదని ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ రాష్ట్ర హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ విషయంలో హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, దివంగత ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీఆర్‌ (NTR) విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఏజీ దమ్మాలపాటి గుర్తుచేశారు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధర పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాత్ర ఉన్నట్లు పిటిషనర్ ఎలాంటి ఆధారాలు కోర్టులో సమర్పించలేదని ఏజీ తెలిపారు.

పిటిషనర్ అయిన మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ తరఫున న్యాయవాది బాల దీనిపై స్పందిస్తూ.. గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసి తగిన ప్రతి వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ప్రతివాదనలకు సమయం కోరడంతో పవన్ కళ్యాణ్ పై పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేశారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్‌ను సినిమాల్లో నటించకుండా ఆపాలని, అలాగే హరిహర వీరమల్లు సినిమా, ఇతర వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసేందుకు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం తెలిసిందే.

అసలు వివాదం ఏంటి..ప్రభుత్వ నిధులు, భద్రతా సిబ్బంది, అధికార వాహనాలను సినిమాల కోసం, వ్యాపార ప్రకటనల కోసం వినియోగించడం, పవన్ కళ్యాణ్‌ సినిమాల్లో నటించడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌ ఆగస్టు 19న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి పదవిలో కొనసాగుతూనే సినిమాలు చేయడం, సినీ కార్యక్రమాల్లో పాల్గొనడం అనైతికమని, ఆయనపై  దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్‌లో విజయ్ కుమార్ కోరారు..

పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకుంటారా.. ఇటీవల ఓసారి విచారించిన హైకోర్టు ఈ పిటిషన్‌ను సెప్టెంబర్ 8న విచారణకు అంగీకరించింది. ఈ క్రమంలో సోమవారం నాడు హైకోర్టులో విజయ్ కుమార్ పిటిషన్ పై విచారణ జరిగింది. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లు, వ్యక్తిగత ఈవెంట్ సందర్భంగా ప్రభుత్వ వాహనాలు, భద్రతా సిబ్బందిని వినియోగించడంతో పాటు సినిమా టికెట్ల విషయంలోనూ అధికార దుర్వినయోగం చేశారని విజయ్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు.ఈ అంశంపై దర్యాప్తు చేపట్టి పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని మాజీ ఐఏఎస్ కోర్టును ఆశ్రయించారు. సినిమా ప్రమోషన్లు, రిలీజ్ సమయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ డిప్యూటీ సీఎం అనే వాహనంలో ప్రయాణించారని సైతం వైసీపీ విమర్శలు చేయడం తెలిసిందే.

సినిమాల్లో నటించకుండా ముఖ్యమంత్రులు, మంత్రులపై ఎలాంటి ఆంక్షలు లేవని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టికెట్ల ధరల పెంపులో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని వాదనలు వినిపించారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఇదే సమస్య తలెత్తగా, హైకోర్టు అందుకు అభ్యంతరం చెప్పలేదన్నారు. ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలించి పవన్ కళ్యాణ్ విషయంలో తీర్పు ఇవ్వాలని ఏజీ వాదనలు వినిపించారు. అయితే ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు తీర్పును పరిశీలించాక ప్రతివాదనలు వినిపిస్తామని పిటిషనర్ తరఫు లాయర్ కోరగా.. హైకోర్టు ఈ విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.