AP Highcourt CID : తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల విజయ్ కు చెందిన హైదరాబాద్ నివాసంలో ఏపీసీఐడీ అధికారులు సోదాలు చేయడం, ఆయన పిల్లలను ప్రశ్నించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. చింతకాయల విజయ్ భార్య సువర్ణ రిట్ పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారని.. అన్ని గదుల్లోనూ సోదాలు జరిపారన్నారు. చివరికి చిన్న పిల్లలను కూడా వదిలి పెట్టలేదని భయపెట్టేలా ప్రశ్నించారన్నారు. ఇదంతా చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని.. సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సువర్ణ పటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు డీజీపీ, ఏడీజీ, సీఐ పెద్దిరాజులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
చింతకాయల విజయ్ ఇంట్లో సీఐడీ పోలీసుల సోదాలు
అక్టోబర్ ఒకటో తేదీన హైదరాబాద్‌లోని చింతకాయల విజయ్ ఇంటికి ఏపీసీఐడీ పోలీసులు పది మంది వరకూ వచ్చారు. ఆ సమయంలో చింతకాయల విజయ్ ఇంట్లో లేరు. పనిమనిషులతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు. అయితే వారినే సీఐడీ అధికారులు ప్రశ్నించారని.. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారన్న ఆరోపణలు వచ్చాయి. చింతకాయల విజయ్ పిల్లలను ప్రశ్నించి వారి ఫోటోలు తీసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే సీఐడీ పోలీసులు ఎలాంటి అలజడి సృష్టించలేదని.. ఓ కేసులో నోటీసులు ఇవ్వడానికి వెళ్లారని సీఐడీ తెలిపింది. విజయ్ ఇంట్లో లేకపోవడంతో నోటీసులు ఇచ్చామన్నారు.
ఐ టీడీపీ పెట్టిన పోస్టుల కారణంగా కేసులు
సీఎం జగన్ సతీమణి భారతిని కించపరిచేలా భారతీపే పేరుతో పోస్టర్లు వేశారని.. ఐ టీడీపీ పేరుతో వాటిని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారని ... కేసు పెట్టారు. అయితే ఐ టీడీపీ అనేది సంస్థ కాదని.. తనను కేసు నుంచి తప్పించాలని విజయ్ హైకర్టును ఆశ్రయించారు. అయితే నిబంధనల ప్రకారం విచారణ కొనసాగించాలని సీఐడీకి హైకోర్టు తెలిపింది. కేసును కొట్టి వేయడానికి నిరాకరించంది. మరో వైపు ఈ కేసులో విజయ్ నోటీసులు ఇచ్చిన ప్రకారం హాజరు కాకపోవడంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని సీఐడీ అధికారులు గుంటూరు కోర్టును సీఐడీ అధికారులు ఆశ్రయించారు. కేసు విషయంలో నోటీసులు ఇవ్వడానికి వెళ్తే.. తమను చింతకాయ విజయ్ అనుచరులు అడ్డుకున్నారని తెలిపారు. విచారణకు హాజరు కాలేదని దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సీఐడీ పోలీసు తీరుపై టీడీపీ నేతల తీవ్ర విమర్శలు
సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వకుండా.. ఇలా వరుసగా టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో పలువుర్ని అంతే అరెస్ట్ చేశారు. చింతకాయల విజయ్ ను కూడా అలాగే అరెస్ట్ చేయడానికి రెండు, మూడు వాహనాలతో వచ్చారని కానీ ఆయన ఇంట్లో లేకపోడంతో నోటీసులు ఇచ్చారని టీడీపీ నేతలంటున్నారు. ఈ వ్యవహారంపై నేరుగా డీజీపీ, సీఐడీ ఏడీజీకి నోటీసులు రావడంతో .. తదుపరి విచారణ కీలకంగా మారింది.