Anantapur Floods: అనంతపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా మొత్తం వరుణుడి ధాటికి తడిసి ముద్దయిపోయింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ తీసుకున్న సహాయకల చర్యలు, బాధితులను ఆదుకునే కార్యక్రమాల గురించి అధికారులు పూర్తి వివరాలను సీఎంకు తెలిపారు. అనంతపురంలో హఠాత్తుగా కుండపోతగా వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టిన సహాయ కార్యక్రమాల వల్ల ఆస్తి నష్టం వాటిల్లలేదు. వీటికి సంబంధించిన వివరాలను గురించి సీఎం జగన్ కు తెలిపారు అధికారులు.
బాధితులకు రెండు వేల చొప్పున ఆర్థిక సాయం..
వర్షాలు, వరదలు కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలకు రూ.2 వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని తెలిపారు. అంతేకాకుండా బియ్యం, పామాయిల్, కంది పప్పు, బంగాళ దుంపలు, ఉల్లిపాయలు వంటి నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయాలన్నారు. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనాలు తయారు చేసి తనకు సమర్పించాలని సూచించారు. ]
భారీ వరదతో కొట్టుకుపోయిన లారీ..
అనంతపురంలో కురిసిన వర్షాలతో చెరువులన్నీ పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలోనే వాగుపైనుంచి వెళ్తున్న ఓ లారీ.. వరద దాటికి అందులో పడి కొట్టుకుపోయింది. డ్రైవర్ లారీలోనే ఉండిపోయాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు అతడిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా. నేడు బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్.టీ.ఆర్. జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయి. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరానికి పశ్చిమ భాగాల్లోని ప్రాంతాలు, తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతంలో మోస్తరు వర్షాలున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. కానీ అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాత్రి సమయానికి అనంతపురం - కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు, సత్యసాయి జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు వర్షాలు విస్తరించనున్నాయి.