5G Links Update: ఎలక్ట్రానిక్‌ ప్రపంచాన్ని రాకెట్‌ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్లగల 5జీ సేవలు మన దేశంలోని కొన్ని నగరాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 1న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను ప్రారంభించారు. కమర్షియల్‌ ప్రాతిపదికన భారతీ ఎయిర్‌టెల్‌ (Bharati Airtel), పైలట్‌ ప్రాతిపదికన రిలయన్స్‌ జియో (Reliance Jio) కొన్ని నగరాల్లో సేవలను ప్రారంభించాయి. దిల్లీ, ముంబయి సహా మెట్రో నగరాల్లో 5జీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 


బకరా కావద్దు
అయితే, కొన్ని టెక్నికల్‌ గ్లిచెస్‌ (సాంకేతిక ఇబ్బందులు) వల్ల ఈ సేవలు వినియోగదారులకు అందడం లేదు. దీన్ని అవకాశంగా మార్చుకుంటున్నారు సైబర్‌ మోసగాళ్లు. 5జీ సేవలు అందాలంటే తాము పంపే లింకులను క్లిక్‌ చేయమంటూ సందేశాలు పంపుతున్నారు. ఆ లింక్‌ మీద క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌ 5జీ సర్వీసులు అందుకోవడానికి అనువుగా ఫోన్‌ అప్‌డేట్‌ అవుతుందని సదరు మెసేజెస్‌లో ఊరిస్తున్నారు. మీ దగ్గర 4జీ ఫోన్‌ ఉన్నా పర్లేదని, తాము పంపిన లింక్‌ క్లిక్‌ చేస్తే ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఆటోమేటిక్‌గా 5జీకి అప్‌డేట్‌ అవుతుందని పేర్కొంటున్నారు. మనలో చాలామంది ఫోన్లకు ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయి. వెనకా, ముందు చూసుకోకుండా అతిగా ఆవేశపడి ఆ సందేశాల్లోని లింక్‌ మీద క్లిక్‌ చేశారనుకోండి.. మీరు మేక (బకరా) అయిపోతారు.


టార్గెట్స్‌ ఎయిర్‌టెల్‌, జియో
ప్రస్తుతం ఎయిర్ టెల్, జియో మాత్రమే 5జీ సేవలు అందిస్తున్నాయి కాబట్టి, ఆ రెండు కంపెనీల సిమ్‌లు ఉన్న వినియోగదారులనే సైబర్‌ కేటుగాళ్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. 'ఏపీకే ఫైల్స్‌'ను లింకుల ద్వారా గంపగుత్తగా పంపిస్తున్నారు. అవన్నీ 
మాల్‌వేర్‌ ఫైల్స్‌. మీరు గానీ లింక్‌ మీద క్లిక్‌ చేశారా... మీ సొమ్ము దొంగల చేతికి ఇచ్చినట్లే. సదరు మాల్‌వేర్‌ ఫైల్స్‌ సెల్‌ఫోన్‌లోకి చొరబడతాయి, ఫోన్‌లోని సమాచారం మొత్తాన్ని సైబర్‌ నేరగాళ్లకు పంపుతాయి. అందులోని వ్యక్తిగత చిత్రాలు, రహస్యాలు క్షణాల్లో వాళ్లకు అందుతాయి. వాటిని ఉపయోగించుకుని నేరగాళ్లు బెదిరింపులకు దిగే ప్రమాదం ఉంది.


డిసెంబర్‌ నాటికి ఒరిజినల్‌ 5జీ అప్‌డేట్స్‌
స్మార్ట్‌ఫోన్‌ తయారీదార్లు, టెల్కోలతో టెలికాం విభాగం, ఐటీ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక సమావేశం నిర్వహించింది. మన దేశంలో లక్షల మంది చేతుల్లో 5జీ రెడీ ఫోన్లు ఉన్నా.. వాళ్లకు సేవలు అందకపోవడం మీద చర్చలు సాగాయి. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ ఇవ్వడానికి హై ప్రయారిటీ ఇవ్వాలని ఫోన్‌ తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా సూచించింది. దీంతో, శాంసంగ్‌, యాపిల్‌ కంపెనీలు తమ 5జీ ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను నవంబరు-డిసెంబరు నెలల్లో అందించనున్నాయి. యాపిల్‌ ఐఫోన్‌ 14, 13, 12, SE మోడళ్లకు ఇవి అందుతాయి. నవంబరు మధ్యనాటికి తమ అన్ని 5జీ ఫోన్లలో ఓవర్‌-ద-ఎయిర్‌ అప్‌డేట్స్‌ ఇస్తామని శాంసంగ్‌ వెల్లడించింది. 


అప్‌డేట్స్ ఇవ్వడానికి ఈ కంపెనీలు ఎలాంటి లింక్‌లు పంపవు. సెట్టింగ్స్‌లోని సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారా దీనిని అందిస్తాయి. కాబట్టి, 5జీ అప్‌డేట్‌ అంటూ లింక్‌ వచ్చిందంటే, అది కచ్చితంగా ఫిషింగ్‌గానే గుర్తించాలి. తస్మాత్‌ జాగ్రత్త!.