Munugodu TDP :  మునుగోడులో తెలుగుదేశం పార్టీ పోటీ  చేయాలనుకుంటోందని ఆ పార్టీ తరపున సీనియర్ నేత జక్కిలి ఐలయ్య యాదవ్ పోటీకి ఆసక్తిగా ఉన్నారని రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. 13వ తేదీన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల్లో పోటీ చేసిన అంశంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కానీ రెండు రోజులు ఆలస్యంగా సమావేశం అవుతున్నారు. 15వ తేదీన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నారు. అయితే ఈ లోపు నామినేషన్ల గడువు ఆఖరికి వస్తుంది. అప్పుడు నిర్ణయం తీుకున్నా టీడీపీ అభ్యర్థి పోటీ చేసే పరిస్థితి ఉండదు. అందుకే  తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలన్న ఆలోచనలో లేదని తెలుస్తోంది. 


తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయం


ఇటీవల తెలంగాణలో మారిపోయిన రాజకీయ పరిస్థితులతో .. తెలుగుదేశం పార్టీని మళ్లీ పూర్తి స్థాయిలో యాక్టివ్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీపై టీఆర్ఎస్ నేతలు ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్‌గా మారిపోవడం.. ఏపీలో కూడా పోటీ చేయడానికి సిద్ధం కావడంతో .. తెలుగుదేశం పార్టీ కూడా ఇక తమ జవ సత్వాలన్నింటినీ కూడగట్టుకోవాలని అనుకుంటోంది.  ఇప్పుడు ఉపఎన్నికల్లో పోటీ చేసి సమయాన్ని వృధా చేసుకోవడం కన్నా.. వచ్చే ఎన్నికల నాటికి వీలైనంతగా బలపడే ప్రయత్నం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ దిశగా కార్యాచరణ కోసమే చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. 


లీడర్, క్యాడర్ లేని పార్టీగా మారిన టీడీపీ.. సానుభూతి పరులపైనే ఆశలు


తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలందరూ ఇతర పార్టీల్లో చేరిపోయారు. క్యాడర్ కూడా వారి వెంట వెళ్లిపోయారు. కానీ టీడీపీ సానుభూతిపరులు మాత్రం ఎక్కువగానే ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ మళ్లీ రీవైవ్ అయితే ..ఇతర పార్టీలు అంత తేలికగా తీసుకోవన్న అభిప్రాయం ఉంది. తెలంగాణ బీసీ వర్గాల్లో టీడీపీకి ఉన్న పట్టు కారణంగా... తెలంగాణ సెంటిమెంట్ లేకపోతే.. బాగా బలం పుంజుకుంటుందన్న వాదన ఉంది. అందుకే.. టీడీపీ ముఖ్య నేతలు ఇప్పుడు ఈ కోణంలోనే రాజకీయంగా బలపడే ఆలోచనలు చేస్తున్నారు. 


ఏపీపైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్న చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఏపీలో అధికారంలోకి రావడంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. మరో సీనియర్ నేతకు కూడా బాధ్యతలు అప్పగించలేకపోతున్నారు. ఇక ముందు మంచి ప్రజాకర్షణ ఉన్న నేతను తెలంగాణకు ఇంచార్జిగా నియమించే ఆలోచన చంద్రబాబు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ఎలా ముందుకు వెళ్లాన్న అంశంపై చంద్రబాబు.. పదిహేనో తేదీన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.  ఉపఎన్నికల్లో ఎప్పుడూ ఓ అంశంపైనే ఓటింగ్ జరుగుతుందని..  పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు వివరించే అవకాశం ఉంది.