ఏపీ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ సాధారణ బదిలీల ప్రక్రియను ప్రారంభించింది. బదిలీల విషయంలో ఈ శాఖకు సంబంధించి అనుసరించాల్సిన ప్రత్యేక విధివిధానాల్ని శనివారం(మే 31న) ప్రకటించడంతో ఈ ప్రక్రియ మొదలైంది. 20 రోజుల్లో బదిలీలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
లక్షకు పైగా సిబ్బంది కలిగిన వైద్య ఆరోగ్య శాఖలో15,000 మందికి పైగా రెగ్యులర్ సిబ్బంది బదిలీ అయ్యే అవకాశముందని ఉన్నతాధికారుల అంచనా. రెండేళ్ల తర్వాత వైద్యారోగ్య శాఖలో సాధారణ బదిలీలు చేపడుతున్నందున అన్ని వర్గాల ఉద్యోగుల్లో ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది.
బదిలీల్లో ప్రత్యేక నిబంధనల అమలు
గత మే 15న ఆర్థిక శాఖ జారీ చేసిన సాధారణ బదిలీల మార్గదర్శకాలలో ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఆయా మంత్రిత్వ శాఖలు కొన్ని ప్రత్యేక నియమాల్ని రూపొందించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించి కొన్ని ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రి ఆమోదం కోసం ప్రతిపాదించారు.
అధికారులపై అవినీతి ఆరోపణలు
దీర్ఘ కాలంగా ఒకే చోట పనిచేస్తున్న పరిపాలనా సిబ్బంది పలు అక్రమాలకు పాల్పడుతున్నారని హెల్త్ మినిస్ట్రీ ఆఫీస్ కు ఆరోపణలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే చోట మూడేళ్ల కంటే ఎక్కువకాలం పనిచేస్తున్న పాలనా సిబ్బందిని వేరే ప్రదేశాలకు బదిలీ చేయడం ఈ విడత నిబంధనల్లో ప్రధానాంశం. ఇలా చేయడం ఇదే మొదటిసారి.
అదే విధంగా...ఒకే చోట మూడు నుండి తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్ని అదే స్టేషన్లో వేరే కార్యాలయాలకు బదిలీ చేస్తారు. ఖాళీలు లేనిపక్షంలో ఇతర ప్రదేశాలకు మారుస్తారు.
ఈ బదిలీల్లో వివిధ కారణాలతో వేరే పోస్టుల్లో(మిస్‌మ్యాచ్) పనిచేస్తున్న వారిని సరైన పదవుల్లో నియమించడానికి ప్రాధాన్యతనిస్తారు. ఒకే చోట ఐదేళ్లకుపైగా పనిచేస్తున్న ఇతర సిబ్బందిని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. అడిషన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(ఎడిఎంఇ) స్థాయి వైద్యుల్ని పరిపాలనా అవసరాలకనుగుణంగా మారుస్తారు.
స్పష్టత కోసం స్పెషల్ మెమో
శనివారంనాడు విడుదల చేసిన మార్గదర్శకాల్లో జిల్లా కేంద్రాల్లోని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లలో పనిచేస్తున్న పాలనా సిబ్బందిని బదిలీ చేయాలనే సాధారణ ప్రస్తావన ఉంది. ఈ ప్రతిపాదన దురుపయోగమయ్యే అవకాశముందని మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికొచ్చింది. ఈ నేపథ్యంలో పాలనా సిబ్బంది బదిలీ కోసం పరిగణలోకి తీసుకోవాల్సిన కార్యాలయాలు(అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లు), మరియు బదిలే చేయవలసిన పాలనా సిబ్బంది స్థాయి వివరాలపై స్పష్టతనివ్వాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ వివరణాత్మక మొమోని విడుదల చేస్తుంది.
ఇటీవల జరిగిన బదిలీలు
2023 నుండి సాధారణ బదిలీలపై నిషేధం అమలులో ఉంది. ఈ కారణంగా జూన్ 2024 నుండి వివిధ చోట్ల పనిచేస్తున్న దంపతుల్ని ఒక చోటకు చేర్చడం, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూసిబ్బంది పనిచేసే చోట సరైన చికిత్స అందుబాటులో లేనిపక్షంలో తగిన చికిత్స లభించే చోటకు మార్చేందుకు మాత్రమే వీలుగా ముఖ్యమంత్రి ఆమోదంతో బదిలీలు జరిగాయి.
అదే స్ఫూర్తితో సాధారణ బదిలీలపై మే15న ఆర్థిక శాఖ నిషేధాన్ని ఎత్తివేసినప్పటి నుండి ఆరోగ్య మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ దాదాపు 30 బదిలీ అభ్యర్థనల్ని ఆమోదించారు. ఇవి మొత్తం చేపట్టనున్న బదిలీల్లో కేవలం 0.20 శాతం.
వైద్య ఆరోగ్య మంత్రి ఆమోదించిన కొన్ని బదిలీల వివరాలు
కడప జిల్లాలోని ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రంలో పనిచేస్తూ మార్చ్ నెలలో వివాహమైన 12 రోజుల్లోనే భర్తను కోల్పోయిన ఒక డాక్టర్ ఈ క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబానికి దగ్గరగా ఉండేలా బదిలి చేయాలని చేసుకున్న విన్నపం, రాయచోటిలో పనిచేస్తూ తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ సదుపాయమున్న చోటకు బదిలీచేయాలన్న ఒక సీనియర్ అసిస్టెంట్ అభ్యర్ధన, ముదిరిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బదిలీ కోసం చేసిన మరో డాక్టర్ విన్నపం, శ్రీకాకుళం జిల్లాలోని ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రంలో డాక్టర్ గా పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న భర్తకు దగ్గరగా ఉండేందుకు నెల్లూరు జిల్లాకు బదిలీ చేయాలన్న ఒక మహిళా డాక్టర్ వేడుకోలు వంటి వాటిని ఆల్రెడీ వైద్య శాఖ ఆమోదించింది.
ఏపీలో ప్రారంభమైన బదిలీల ప్రక్రియలో భర్తీ చేయాల్సిన స్థానాల వివరాలు ప్రకటించడం, బదిలీలు కోరుకునే వారు అభ్యర్థనలు దాఖలు చేసుకోవడం, అభ్యర్థుల సర్వీసు వివరాల పరిశీలన మరియు సీనియారిటీ ఆధారంగా లిస్టుల ప్రకటన, అభ్యంతరాల నమోదు మరియు వాటి పరిశీలన, నియమాలను బట్టి ఉన్నతాధికారుల నిర్ణయం కోసం ప్రతిపాదనల్ని పంపించడం మరియు బదిలీల ఆదేశాలు జారీచేయానికి నిర్ధిష్ట కాలపరిమితులతో వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఈ షెడ్యూల్‌ను రూపొందించింది.