తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌‌కు ఉన్న భద్రతను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆయనకు భద్రతగా ఉన్న ఇద్దరు గన్ మెన్లను వెనక్కి రప్పించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆదివారం వరకూ పయ్యావుల కేశవ్ కు 1+1 గన్‌మెన్లు భద్రతగా ఉండేవారు. తనకు సెక్యూరిటీని పెంచాలని కొద్దిరోజుల క్రితమే పయ్యావుల కేశవ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, పీఏసీ ఛైర్మన్‌గా కేబినెట్ హోదా ఉన్న వ్యక్తికి భద్రతను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రభుత్వానికి వివరణ ఇచ్చాకే ఆయనకు భద్రతను తొలగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఇలా ప్రవర్తించిందని విమర్శిస్తున్నారు. 


అయితే, టీడీపీ చేస్తున్న విమర్శలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రజా ప్రతినిధులకు కేటాయించే గన్‌మెన్లను మూడేళ్లకు ఓసారి ట్రాన్స్‌ఫర్ చేసే నిబంధన ఉందని, అందుకే ఆయనకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్‌మెన్లను ఉపసంహరించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఆయనకు కొత్త భద్రతా సిబ్బంది నియామకం అవుతారని చెప్పారు.



ఉరవకొండ ఎమ్మెల్యే అయిన పయ్యావుల కేశవ్ పెగాసస్ అంశంపై వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెగాసస్ ఎక్విప్‌ మెంట్ చంద్రబాబు కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్టీఐకి సమాధానం ఇచ్చారని.. కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతోప్రభుత్వం ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పుడు వైసీపీ సర్కార్ తమ ఎమ్మెల్యేలు, మంత్రులపైనే నిఘా పెట్టిందని విమర్శలు చేశారు. విపక్షం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా మొత్తం వైసీపీ నేతలతోనే పెగాసస్‌పై ఏర్పాటు చేసిన సభా సంఘానికి విలువ ఎక్కడుందని పయ్యావుల ప్రశ్నించారు.