Kishan Reddy Reaction on KCR Comments: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం (జూన్ 10) పెట్టిన ప్రెస్ మీట్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. సీఎం చేసిన కామెంట్స్‌ను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వర్షాలు, సహాయక చర్యలను పట్టించుకోకుండా కేసీఆర్ తన చిల్లర మాటలు, చిల్లర వేషాలతో కేంద్ర ప్రభుత్వంపైన, మోదీపైన విమర్శలు చేశారని అన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండు రోజులపాటు విపరీతంగా ప్రపంచ స్థాయిలో పరిశోధన చేసి రెండు గంటలు ఏకధాటిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే చెప్పారు. సొంత డబ్బా పరనింద అన్నట్టు అసలు విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారుఅన్న సంగతిని మర్చిపోయి తన చిల్లర మాటలు చిల్లర వేషాలతో మరోసారి కేంద్ర ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ పైనా అన్నిటికంటే ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తీవ్రమైన విమర్శలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గతంలో వర్షం వచ్చినప్పుడు ఏ తప్పులు జరిగాయి, ఏ లోపం కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, వంటి వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మర్చిపోయి మరొక్కసారి తన కల్లబొల్లి మాటలతో అసందర్భ వాచాలత్వంతో అడ్డగోలుగా మాట్లాడారు.
ప్రపంచంలోని అనేక విషయాల్ని ఉదహరిస్తూ తనను తాను మహా జ్ఞాని అన్నట్లు అన్ని విషయాలు తనకే తెలిసినట్టుగా తానెంతో అహంకారంతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీని అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించడం కేసీఆర్ డొల్లతనానికి నిదర్శనం.
కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంతో బాధ్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తన హోదాను మరిచి, హుందాగా వ్యవహరించాల్సింది పోయి చాలా చౌకబారు భాషతో అపహాస్యంగా అవహేళనగా మాట్లాడటం కేసీఆర్ అసహనాన్ని అభద్రతా భావాన్ని తన లోపల గూడుకట్టుకున్న భయాన్ని తెలియజేస్తున్నది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు గాని, దేశ ప్రజలు గాని అమాయకులు కారని అబద్ధాల్ని అసంబద్ధ విషయాల్ని పదేపదే చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మని, కేసీఆర్ గారు ఇకనైనా హుందాగా వ్యవహరించి ముందుగా స్థానికంగా వరదలకారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తన బాధ్యత నిర్వహించాలని ప్రపంచ స్థాయి విషయాల్ని దేశ స్థాయి విషయాల్ని తర్వాత చర్చిస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాను’’ అని కేంద్ర సాంస్కృతిక పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి కే కిషన్ రెడ్డి స్పందించారు.