Kadapa Steel Plant : కడప ఉక్కు కర్మాగారానికి ఓబుళాపురం ప్రాంతంలోని ఐరన్ ఓర్ ను ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా అందించాలనే లక్ష్యంతో సీఎం  జగన్ పని చేస్తున్నారని, మైన్స్ అండ్ జీయాల‌జీ డైరెక్టర్ వి.జి.వెంక‌ట్ రెడ్డి తెలిపారు. అనేక వివాదాలకు కేంద్రంగా మారిన ఓబుళాపురం ఐరన్ ఓర్ గనుల్లో  అత్యంత పారదర్శకంగా మైనింగ్ కార్యక్రమాలు జరగాలంటే ప్రభుత్వ రంగ సంస్థకే లీజులను రిజర్వు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందుకోసం ఇప్పటికే కేంద్ర గనుల శాఖకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని, ముఖ్యమంత్రి  జగన్ కూడా ప్రధానమంత్రికి స్వయంగా ఈ మేరకు లేఖ రాశారని తెలిపారు. మైనింగ్ వివాదాలపై వెంక‌ట‌ర్ రెడ్డి ప్రత్యేక ప్రకట‌న‌ను విడుద‌ల చేశారు. అందులో ఏపీఎండీసీ ద్వారా ఇనుప ఖనిజాన్ని వెలికితీసి, దానిని కడప ఉక్కు కర్మాగారానికి ముడి ఖనిజంగా రవాణా చేయడం ద్వారా ప్రభుత్వరంగంలోని సంస్థలను ప్రోత్సహించడం, దాని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుకునే ఆలోచన చేస్తోంది. 


ఏపీఎండీసీకి రిజర్వ్ 


అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ఐరన్ ఓర్ మైనింగ్ కూడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా, పారదర్శక విధానాల్లో మైనింగ్ జరిగేందుకు మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  అనంతపురం జిల్లా ఓబుళాపురం ప్రాంతంలో ఆరు ఐరన్ ఓర్ లీజులకు 1956 నుంచి 2007 వరకు వివిధ దశల్లో అప్పటి ప్రభుత్వాలు లీజులను మంజూరు చేశాయి. పలు ఆరోపణలతో 2009లో ఈ ఆరు లీజులను సస్పెండ్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 723ని జారీ చేసింది. మెస్సర్స్ బళ్ళారీ ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 27.120 హెక్టార్లలో 1956లో లీజ్ కు ఇచ్చింది.  ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 25.981 హెక్టార్ లలో  1964న ఓరిజినల్ లీజ్ ఎగ్జిక్యూట్ చేసింది. అనంతపూర్ మైనింగ్ కంపెనీకి 6.5 హెక్టార్ లలో  1956న ఓరిజినల్ లీజ్ ఎగ్జిక్యూట్ చేసింది. ఈ మూడు లీజులకు సంబంధించి 1957 ఎంఎండీఆర్ చట్టం,సెక్షన్ 8(ఎ)(4) ప్రకారం కాలపరిమితి  2020తో లీజ్ ముగిసింది. ఈ లీజులను ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీకి రిజర్వు చేయాలని కోరుతూ కేంద్ర గనుల శాఖను ఏపీ ప్రభుత్వం కోరింది. కాలపరిమితి ముగిసిన ఈ మూడు ఐరన్ ఓర్ లీజ్ ఏరియాలను ఏపీఎండీసీకి రిజర్వ్ చేయమని 2022 జనవరిలో ప్రధానికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి కోరారు.  


కేంద్రం నిబంధనల మేరకు లీజులు జారీ


కేంద్ర గనులశాఖ కార్యదర్శికి కూడా ఈ మూడు గనుల లీజులను ఏపీఎండీసీకి రిజర్వ్ చేయాలని అభ్యర్థిస్తూ ఏపీ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది.  సుప్రీంకోర్టులో ఓబుళాపురం గనులకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ దాఖలైన కేసులపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే మూడు ఐరన్ ఓర్ లీజుల కాలపరిమితి ముగిసిన కారణంగా అన్ని అర్హతలు ఉన్న వాటికి కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజులు జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉందని తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ప్రాంతంలోని గనులకు సంబంధించి అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఇదే క్రమంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకారం ఓబుళాపురం సరిహద్దులను నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం సర్వే రాళ్లను  ఏర్పాటు చేసింది. సరిహద్దుల నిర్ధారణ కూడా పూర్తవ్వడంతో న్యాయస్థానంలో ఉన్న కేసును పరిష్కరించడం కోసం వాదనలను త్వరగా వినిపించాలని రాష్ట్రప్రభుత్వం అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ ను అభ్యర్థించింది. 


న్యాయస్థానం తీర్పు మేరకు 


ఈ వివాదం పరిష్కారం అయితే మూడు గనులకు కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనింగ్ లీజులు జారీ చేసేందుకు వీలువుతుంది. ఇవి కాకుండా ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కి 39.481 హెక్టార్లు, అలాగే 68.5 హెక్టార్ లలో  2007లో రెండు  ఓరిజినల్ లీజ్ డీడ్ లను ఎగ్జిక్యూట్ చేసింది.  వీటి కాలపరిమితి 2057 వరకు ఉంది. వై.మహాబలేశ్వరప్ప & సన్స్ కు 20.24 హెక్టార్లలో 1978లో ఓరిజినల్ లీజుకు ఇచ్చింది. దీని కాలపరిమితి  2028 వరకు ఉంది. అయితే ఈ మూడు లీజులు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాయి. న్యాయస్థానంలో ఓబుళాపురం ఐరన్ ఓర్ లీజులపై కేసులు దాఖలవ్వడంతో విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మొత్తం లీజులకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చే తీర్పునకు అనుగుణంగా లీజుదారులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపడుతుందని వెంక‌ట్ రెడ్డి ప్రక‌ట‌న లో పేర్కొన్నారు.