Jagananna Videshi Vidya Deevena : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పథకం ద్వారా అర్హులైన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ప్రభుత్వం చెల్లించనుంది. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో  సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 100పై బడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తుంది ప్రభుత్వం.  నాలుగు వాయిదాల్లో నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమచేస్తారు.


దరఖాస్తులు ఆహ్వానం 


జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సాయం పొందేందుకు అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్‌ 200 లోపు క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకుల్లో ఉన్న విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థల్లో  పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. ఈ వర్గాలకు చెందిన 35 ఏళ్ల లోపు విద్యార్థులు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 


సెప్టెంబర్ 30వ తేదీ లోపు


అయితే విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంటర్ లో 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్‌ చదవాలనుకునే విద్యార్థులు నీట్‌లో అర్హత సాధించి ఉండాలి. ప్రపంచంలో టాప్‌ 100లోపు ర్యాంకు గల యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో సీట్ సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వం  100 శాతం ఫీజు చెల్లిస్తుంది. 101 నుంచి 200లోపు ర్యాంకు కలిగిన విద్యాసంస్థల్లో అడ్మిషన్‌ వస్తే రూ.50 లక్షలు, 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం చెల్లిస్తుంది. జగనన్న విదేశీ విద్యాదీవెనకు అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ లోగా https://jnanabhumi.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.


అర్హతలు 


జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో స్థానికుడై ఉండాలి, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంద‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్‌ ఇస్తారు. సీఎస్ నేతృత్వంలో కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయాల‌ని నిర్ణయం తీసుకున్నారు. 2016-17 నుంచి లబ్దిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్లను బకాయిలు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. టీడీపీ ప్రభుత్వ సమయంలో ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలకు విదేశీ విద్య పథకాన్ని వర్తింపచేయలేదని వెల్లడించింది. ఇప్పుడు అగ్రకులాల్లోని పేదలకు వర్తింపజేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వంలో సంవత్సరాదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికి వర్తింపు, ఇప్పుడు ఆదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉన్నవారికీ వర్తింపు చేయనున్నారు. ప్రపంచంలోని ఎక్కడైనా 200 అత్యుత్తమ యూనివర్సిటీలకు వర్తింపు చేస్తున్నారు.  టాప్‌ 100 యూనివర్శిటీల్లో సీటు వస్తే పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నారు. 101 నుంచి 200 లోపు ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షలు వరకూ ఫీజులను చెల్లించనున్నారు. టాప్‌ 200 యూనివర్శిటీల్లో ఎంతమంది సీట్లు సాధించినా వర్తింపు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.