Transfer of Andhra Pradesh Govt teachers rejected | ఉపాధ్యాయుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల అక్రమ బదిలీలు రద్దు చేస్తూ  ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 2024 నుంచి జూన్ 2024 వరకు జరిగిన టీచర్ల బదిలీలను రద్దు చేశారు. ఏపీ విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం టీచర్ల బదిలీలను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజుల నుంచి టీచర్ల బదిలీలలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జరిగిన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ల బదిలీలను రద్దు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


ఎన్నికలకు ముందు ఏపీలో టీచర్ల బదిలీలు 
ఏపీలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీల వ్యవహారంపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం గుర్రుగా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్రంలో జరిగిన టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరగలేదని పేర్కొంటూ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు పొందిన 917 మంది బదిలీలను రద్దు చేసింది. సీఎం చంద్రబాబు టీచర్లు, హెడ్ మాస్టర్ల బదిలీలపై ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు పలు దఫాలుగా వైసీపీ ప్రభుత్వం టీచర్లను బదిలీలు చేసింది. వాటిలో 653 మంది ఉపాధ్యాయుల బదిలీలను అప్పటి సీఎం వైఎస్ జగన్ ర్యాటిఫై చేయడం తెలిసిందే. 


917 మంది టీచర్లకు బదిలీ ఆర్డర్లు ఇచ్చినా రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా వాటిని ర్యాటిఫై చేయలేదు. దీంతో టీచర్లు ట్రాన్స్‌ఫర్ అయినప్పటికీ, ఆర్డర్స్ రాని కారణంగా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ఎన్నికల తరువాత ఏపీలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారిలోకి వచ్చిన వెంటనే టీచర్ల బదిలీలపై గత ప్రభుత్వ ఆదేశాలను నిలుపుదల చేశారు. అందుకు సంబంధించి ఏపీ పాఠశాల విద్యాశాఖ బుధవారం నాడు (జులై 24న) ఉత్తర్వులు జారీచేసింది. 


హైకోర్టును ఆశ్రయించిన టీచర్లు 
తమను ట్రాన్స్‌ఫర్ చేసినా రిలీవ్‌ చేయడం లేదని 215 మంది టీచర్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలోనే పాఠశాల విద్యాశాఖ వైసీపీ సర్కార్ చేసిన బదిలీలకు సంబంధించిన రాటిఫికేషన్‌ ఫైలును సీఎం చంద్రబాబుకు పంపింది. ఆ బదిలీల ఫైలును పరిశీలించిన సీఎం చంద్రబాబు ట్రాన్స్‌ఫర్ల నిర్ణయాన్ని తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దీంతో 917 మంది టీచర్ల బదిలీ ఆగిపోయింది. తాజాగా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసి స్పష్టత ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం డబ్బులు వసూలు చేసి, ఇష్టారాజ్యాంగా టీచర్లను వారు కోరుకున్న చోటుకు బదిలీ చేసి కోట్లు దండుకుందని ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరిగేలా చేస్తామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చేస్తామని కొన్ని రోజుల కిందట ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం స్పష్టం చేశారు.


Also Read: సీటెట్‌ 2024 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం