AP News : విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT) ధర్మాసనం స్టే విధించింది. ఎన్టీజీ ఆదేశాలను సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాత తవ్వకాలు ప్రారంభించినట్లు పేర్కొంది. పర్యావరణానికి ఎలాంటి హానిలేకుండా తవ్వకాలు చేపడతామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. రుషికొండ తవ్వకాలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మే 6న ఎన్జీటీ విచారణ చేసింది. ఈ విచారణలో తవ్వకాలపై అధ్యయనానికి జాయింట్ కమిటీ వేసింది. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తవ్వకాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 


అసలేం జరిగింది?


విశాఖ రుషికొండ తవ్వకాలపై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే ఇచ్చే వరకు తవ్వకాలు ఆపాలని ఎన్జీటీ బెంచ్ ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి జాయింట్ కమిటీని వేసింది. ఇందుకు ఏపీ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని పేర్కొంది. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఎన్జీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. రుషికొండ వద్ద ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టు పనులపై ఎన్జీటీ స్పందించింది. అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో రుషికొండను పూర్తిగా తొలచి వేస్తున్న దృశ్యాలు ఇటీవలి వైరల్ అయ్యాయి. వీటి ఆధారంగా రుషికొండ ప్రాంతంలో ప‌ర్యావ‌ర‌ణ ఉల్లంఘన జ‌రుగుతుందని నర్సాపురం ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. తవ్వకాల్లో ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు, నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. వీటిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని ఎన్జీటీని కోరారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన ఎన్జీటీ ఇటీవల స్టే ఆదేశాలు జారీ చేసింది. ఈ తవ్వకాల అంశంపై హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిటిషన్ వేశారు. దీనిపై కూడా విచారణ జరుగుతుంది.


నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ, ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్‌ కోస్టల్ మేనేజ్మెంట్ అధికారులతో ఎన్జీటీ కమిటీ ఏర్పాటుచేసింది. ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహారిస్తుందని మధ్యంతర ఉత్తర్వుల్లో గ్రీన్ ట్రైబ్యునల్ పేర్కొంది. ఎన్జీటీ ప్రిన్సిపల్‌ బెంచ్‌ ఇచ్చిన ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇవాళ సవాల్​ చేసింది. ఎన్జీటీ స్టే ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. రుషికొండ తవ్వకాలు, నిర్మాణాలకు అనుమతివ్వాలని పిటిషన్‌లో పేర్కొంది.