పీఆర్సీ, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపింది. అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ, ఇతర శాఖల కార్యదర్శులతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బుధవారం సమావేశమయ్యారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో గుర్తింపు పొందిన సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పీఆర్సీతో పాటు ఆర్థికేతర అంశాలపై ఉద్యోగసంఘాలతో ప్రభుత్వం చర్చించింది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సమీర్‌శర్మ కార్యదర్శులను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలను కలెక్టర్లు, జాయింట్‌ స్టాఫ్ కౌన్సిల్‌ ఏర్పాటు చేసి పరిష్కారించాలని ఆదేశించారు. వివిధ శాఖల్లో ఉద్యోగుల పదోన్నతులపై వచ్చే ఏడాది నుంచి డిపార్ట్‌మెంటల్‌ క్యాలెండర్లు రూపొందించాలని సీఎస్‌ అధికారులకు నిర్దేశించారు. క్రిస్మస్ తర్వాత ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 


Also Read: రామతీర్థం రాములోరి లోగిట్లో రాజకీయ రచ్చ... ప్రోటోకాల్ పాటించలేదని అశోక్ గజపతిరాజు ఆగ్రహం.. సర్కస్ కంపెనీ అంటారా అని మంత్రులు మండిపాటు


ఉద్యమానికి తాత్కాలికంగా బ్రేక్


ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టత వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాల‌తో మంత్రి బుగ్గన‌ రాజేంద్రనాథ్, ప్రభుత్వ స‌ల‌హాదారు స‌జ్జల రామకృష్ణ పలు దఫాలుగా చ‌ర్చలు జరిపారు. సీఎస్ స‌మీర్ శ‌ర్మతో కూడా ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. సీఎస్ తో భేటీ త‌ర్వాత ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాయి. సీఎం జ‌గ‌న్ తో మంత్రి బుగ్గన‌, స‌జ్జల భేటీ అయ్యి ఉద్యోగ సంఘాల డిమాండ్లను వివరించారు. ఉద్యోగుల ఇత‌ర డిమాండ్లపై ప్రభుత్వం ఓకే చెప్పినప్పటికీ ఫిట్‌మెంట్ పై మాత్రం సీఎం జ‌గ‌న్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 


Also Read: ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా... కొత్తగా 103 కేసులు, ఇద్దరు మృతి


సీఎం జగన్ నిర్ణయంపై ఉత్కంఠ


సీఎం జగన్ పలుమార్లు మంత్రి బుగ్గన‌, స‌జ్జల భేటీ అయ్యారు. ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఎంత ఇవ్వాల‌నే దానిపై చ‌ర్చించినట్లు తెలుస్తోంది. ఫిట్‌మెంట్ పై తుది నిర్ణయం వ‌స్తే, అవ‌స‌ర‌మైతే ఉద్యోగ సంఘాల‌తో సీఎం జగన్ చ‌ర్చిస్తార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ఏపీ జేఏసీ అమ‌రావ‌తి అధ్యక్షుడు బొప్పరాజు ఉద్యమాన్ని తాత్కాలికంగా వివరించామని, ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోతే ఏ క్షణ‌మైనా ఉద్యమానికి వెళ్లే ఛాన్స్ ఉంద‌ని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్న స‌మ‌యంలో ఉద్యమం సరికాద‌నే తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చామ‌ంటున్నారు. ఫిట్‌మెంట్ విష‌యంలో కూడా ఉద్యోగ సంఘాల మ‌ధ్య కూడా ఏకాభిప్రాయం లేనట్లు తెలుస్తోంది. రెండు జేఏసీలు 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. స‌చివాల‌య ఉద్యోగుల సంఘం మాత్రం క‌నీసం 34 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. 


Also Read: రేపట్నుంచి సీఎం జగన్ కడప జిల్లా టూర్... ఈ నెల 25న పులివెందుల చర్చిలో క్రిస్మస్ వేడుకలకు హాజరు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి