పీఆర్‌సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీతో మంత్రుల కమిటీ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. సచివాలయంలో శనివారం మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. హెచ్‌ఆర్‌ఏ స్లాబుల విషయంలో ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసింది. దీంతో కొంత ప్రతిష్ఠంభనకు తెరపడింది. మంత్రులతో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ ఆన్‌లైన్‌లో మాట్లాడారు. హెచ్‌ఆర్‌ఏ స్లాబులతో పాటు కొన్ని అంశాలపై ఇరు వర్గాలకు మధ్య అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. మంత్రుల కమిటీతో చర్చలు కొలిక్కి రావడంతో ఉద్యోగ సంఘాలు సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకున్నాయి. మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించాయి. రేపు సీఎంతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజుల వాడీవేడిగా సాగిన పీఆర్సీ వివాదం కొలిక్కి వచ్చింది. ఎలాంటి అనుమతి లేకపోయినా అడుగడుగునా ఆంక్షలు పెట్టిన ఎక్కడికక్కడ ఉద్యోగులను అరెస్ట్ చేసినా.. చలో విజయవాడ సక్సెస్ అయింది. ఆ విషయాన్ని ముందు ప్రభుత్వం ఊహించలేకపోయింది. కానీ ఊహకందని విధంగా చలో విజయవాడ సూపర్ సక్సెస్ కావడంతో ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచన చేసింది. సీఎం జగన్ అధికారులు, మంత్రుల కమిటీలతో ఉద్యోగుల డిమాండ్లపై చర్చించారు. వెంటనే సమ్మెను ఆపేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. ఉద్యోగుల డిమాండ్లలో కొన్నింటికి హామీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన కమిటీతో సమావేశమై పీఆర్సీ ప్రతిపాదనల్లో కొన్ని సవరణలు చేసినట్టు పేర్కొంది. ఉద్యోగులు చెప్పిన అభ్యంతరాలను స్వీకరించి అందులో సాధ్యమయ్యేవాటికి పూర్తి చేస్తామని మంత్రులు హామీ ఇవ్వడంతో చర్చలు విజయవంతంగా ముగిశాయి.
మంత్రుల కమిటీతో చర్చలు విజయవంత అవ్వడంతో ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి పిలుపు ఇచ్చిన సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటన చేశాయి. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయని ఆ చర్చలు సఫలమయ్యాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫిట్ మెంట్ మినహా ఇతర విషయాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పీఆర్సీ కాలపరిమితిని ఐదేళ్లకు తగ్గించడం ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ హామీ ఇవ్వడంతో సమ్మె నుంచి వెనక్కి తగ్గాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఫిట్ మెంట్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఏం చేయలేమని చేతులెత్తేసినట్టు సమాచారం. ఉద్యోగ సంఘాలు 27 శాతం ఫిట్ మెంట్ అడగగా.. 23 శాతం కన్నా పెంచే అవకాశం లేదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. అలాగే హెచ్ఆర్ఏ 10 శాతం పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయినప్పటికీ ఐఆర్ రికవరీ చేయకపోవడం పీఆర్సీ కాలపరమితి తగ్గించడం, సీపీఎస్ రద్దుపై సానుకూలంగా స్పందించడంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని అన్నింటిని ఆలోచించి ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వంతో చర్చలు సఫలం
పీఆర్సీ సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. తమ డిమాండ్లపై మంత్రి బుగ్గన, సీఎస్‌తో చర్చించామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. తాము పెట్టిన 71 డిమాండ్లపై మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మతో చర్చించామన్నారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించామని మంత్రి తెలిపారు. ఉద్యోగ సమస్యలపై సమావేశాలు పెట్టి పరిష్కరిస్తామని బుగ్గన హామీ ఇచ్చారు. ఆందోళన విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరామని మంత్రి తెలిపారు.
కరోనా కారణంగా పరిపాలన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి బుగ్గన వెల్లడించారు. తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఫ్యామిలీ మెంబరుగా భావిస్తోందని.. టైమ్ బౌండ్ పెట్టుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు అన్నారు. ఉద్యోగులు లేవనెత్తిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని.. ఉద్యోగుల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ బుధవారం సమావేశం అవుతారని బుగ్గన తెలిపారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో టచ్ లో ఉంటామని.. ఉద్యమంలో ఉన్న తొమ్మిది సంఘాలను ఆందోళన విరమించాలని కోరామని ఆర్ధిక మంత్రి వెల్లడించారు.
దురుద్దేశంతో సమ్మెకు వెళ్లలేదు
ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దురుద్దేశ్యంతో ఉద్యమానికి వెళ్లలేదని, సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమించామని తెలిపారు. ఆర్ధికేతర సమస్యలు కూడా చాలా కాలం పెండింగులో ఉన్నాయని తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారని బొప్పరాజు వెల్లడించారు. బుధవారం స్వయంగా సీఎస్ సమీర్ శర్మ సమీక్షించనున్నారని ప్రభుత్వ సానుకూల స్పందనతో తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నామని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.