పీఆర్సీ పెంపు, సీపీఎస్ రద్దు, ఇతర సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. పీఆర్సీపై మరో రెండు రోజుల్లో సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారని తెలిపింది. ఇప్పటికే పీఆర్పీ వేసిన కమిటీ నివేదికను సీఎం జగన్ కు అందించింది. తాజాగా  పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలతో విడివిడిగా సమావేశమైన ఆయన.. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాలకు సజ్జల వివరించారు. సీఎం జగన్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎం జగన్‌ న్యాయం చేస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందని సజ్జల తెలిపారు. ఉద్యోగులు 34 శాతం ఫిట్ మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన సజ్జల ఉద్యోగులు ఇంత కావాలని అడగడంలో తప్పు లేదన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని అన్నారు.


Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !


పే కమిషన్ ప్రకారం పదేళ్లకు పీఆర్సీ ఇవ్వొచ్చు


ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు. ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామన్నారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ వల్ల ఐఆర్‌ కన్నా ఒక్క రూపాయి కూడా తగ్గదన్నారు. ఉద్యోగులు కోరే 45 శాతం ఫిట్ మెంట్ సాధ్యం కాదని కమిటీ చెప్పిందని సజ్జల ఉద్యోగుల సమావేశంలో చెప్పారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని అయినా అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేందుకు సీఎస్‌ కమిటీ ప్రతిపాదనలు చేసిందన్నారు. సీఎస్‌ కమిటీ సిఫార్సు చేసిన ఫిట్‌మెంట్‌ను పెంచే అవకాశం ఉందన్నారు. ఈ పీఆర్‌సీ అమలుకు ఏడెనిమిదేళ్లు పడుతోందన్నారు. పే కమిషన్‌ ప్రకారం పదేళ్లకు ఒకసారి పీఆర్సీ ఇచ్చినా నష్టం ఉండదన్నారు. సీపీఎస్‌ రద్దుపై సీఎం జగన్‌ స్వయంగా హామీ ఇచ్చారని సజ్జల అన్నారు. సీపీఎస్ రద్దుపై కమిటీలు అధ్యయనం చేస్తున్నాయని, త్వరలోనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. 


ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ చర్చలు


పీఆర్సీపై సీఎస్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆమోదయోగ్యం కాదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. నివేదికతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు. నివేదికపై ఉద్యోగుల అభిప్రాయాలను సజ్జలకు వివరించామన్నారు. సీఎం న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్న ఉద్యోగ సంఘాలు... ఐఏఎస్‌లు ఇచ్చిన నివేదికను పరిగణించవద్దని సీఎంను కోరుతున్నామన్నారు. 2018 జులై నుంచి 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సజ్జలను కోరామన్నారు. ఉద్యోగులు ఆశించినట్లు కమిటీ సిఫార్సులు లేవన్నారు. రేపు సీఎంతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారన్నారు. 


సీఎం జగన్ కు పీఆర్సీపై నివేదిక


ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని  సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసింది. పీఆర్సీపై నివేదికను సీఎం జగన్‌కు సోమవారం అందించారు. 27శాతం పీఆర్సీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై  రూ.10 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని సీఎస్ సమీర్ శర్మ చెప్పారు. తమ సిఫార్సులపై సీఎం జగన్ 72 గంటల్లోగా నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. పీఆర్సీపై ఇచ్చిన రిపోర్టును ఫైనాన్స్ వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేస్తామని, ఉద్యోగ సంఘాలకు కూడా ఇస్తామని సమీర్ శర్మ తెలిపారు. పీఆర్సీ అమలుపై 11 ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 2018 నుంచి పీఆర్సీ అమలు ఉంటుందని తెలిపారు.


Also Read:  పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ కీలక నిర్ణయం


పట్టువీడని ఉద్యోగ సంఘాలు


ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చారు. సీఎం జగన్ పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా ఆమోదిస్తే ఉద్యోగులకు ఎలాంటి జీతభత్యాలు పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఇది ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమయ్యే ప్రమాదం ఉన్నందున 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం పీఆర్సీ ప్రకటన ఒకటే సరిపోదని, ముఖ్యంగా సీపీఎస్ రద్దు సహా మరో 77 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. 


Also Read:  10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం... తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు... టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి