AP Govt Australia Agreement : పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశ్చిమ ఆస్ట్రేలియాతో భాగస్వామ్యం కాబోతున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. జులై 16వ తేదీ శనివారం విశాఖపట్నంలోని 'రాడిసన్ బ్లూ' హోటల్ వేదికగా వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా పనిచేసేందుకు ఏపీ, ఆస్ట్రేలియా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.  పరిశ్రమలు, నైపుణ్యం, శిక్షణ, మెరైన్, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యుత్, మైనింగ్ ,మాన్యుఫ్యాక్చరింగ్‌ సహా వివిధ రంగాల్లో తోడ్పాటుకు ఏపీ, వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరస్పర అంగీకార ఒప్పందాలు చేసుకోనుందని మంత్రి తెలిపారు. సోదర రాష్ట్ర ఒప్పందంలో భాగంగా గనులు, ఖనిజాలు, విద్య, శిక్షణ అంశాల్లో పశ్చిమ ఆస్ట్రేలియాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకోనుందని మంత్రి తెలిపారు. 


రాష్ట్రాభివృద్ధికి కృషి 


రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, వివిధ రంగాల్లో పెట్టుబడుల కోసం రెండు ప్రభుత్వాలు కలిసి పని చేస్తాయని మంత్రి గుడివాడ అమర్​ నాథ్ తెలిపారు. పరిశ్రమలు, నైపుణ్యం,  గనులు, ఖనిజాలు, విద్యుత్ రంగాల్లో అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయ‌ని తెలిపారు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను అవ‌కాశాలుగా మార్చుకొని రాష్ట్రానికి అవ‌స‌రమైన ప్రాజెక్టుల‌ను తీసుకురావ‌టం ద్వారా ఉపాధి, అవ‌కాశాలతో పాటు రాష్ట్ర  అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.  ఏపీ ప‌శ్చిమ ఆస్ట్రేలియాల మ‌ధ్య ఒప్పందంతో ఇరు ప్రాంతాల మధ్య స్నేహ‌పూర్వక వాతావ‌ర‌ణం నెల‌కొంటుంద‌ని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.


90  మంది ప్రతినిధులు 


రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, సాంకేతిక సహకారం , నైపుణ్యం అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా సంసిద్ధతతో ఉందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య ఒప్పందం ఉందన్నారు. ఆ బంధం ఏపీతో మరింత బలోపేతం చేసుకునేందుకు ఆస్ట్రేలియా ప్రతినిధులు ఏపీకి వస్తున్నట్లు స్పష్టం చేశారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి ఆ ప్రభుత్వ మంత్రులు సహా మరో  90 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు కరికాల వివరించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక, నైపుణ్య శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ , పశ్చిమ ఆస్ట్రేలియా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొనున్నారని తెలిపారు. 


Also Read : Kotamreddy Sridhar Reddy Success: ఆరోజు మురుగు కాల్వలో దిగారు - ఈరోజు గునపం దింపారు