AP Government MOU With Edx Education Portal: 'రైట్ టు ఎడ్యుకేషన్' అనేది పాత నినాదమని.. పిల్లలకు నాణ్యమైన విద్య అనేది ఓ హక్కు అని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. మన పిల్లలు ప్రపంచ స్థాయితో పోటీ పడాలని.. అప్పుడే భవిష్యత్తు మారుతుందని పునరుద్ఘాటించారు. శుక్రవారం ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. 'ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం. ఈ దేశంలో ఉన్న వారితో కాదు మన పోటీ. ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి. మంచి జీతాలు సంపాదించాలంటే నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యం. అందుకోసం విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి. ఈ ఒప్పందంతో దాదాపు 2 వేలకు పైగా కోర్సులు మన పాఠ్య ప్రణాళికలో పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటీ, ఎల్ఎస్ఈ, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులు కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చు. వాళ్లు కోర్సులు ఆఫర్ చేసి బోధిస్తారు. మన పిల్లలు ఆన్ లైన్ లో వాళ్లతో ఇంటరాక్ట్ అయి డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి. అనంతరం నిర్వహించే పరీక్షల్లో పిల్లలకు వచ్చిన క్రెడిట్స్ మన పాఠ్య ప్రణాళికలో భాగం అవుతాయి. మన దగ్గర యూనివర్శిటీల్లో అందుబాటులో లేని కోర్సులు సైతం ఇక్కడ నేర్చుకునే అవకాశం ఉంటుంది.' అని సీఎం వివరించారు.


సమూల మార్పులు


నాలుగున్నరేళ్లలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. 'మొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశాం. నాడు నేడుతో స్కూళ్ల రూపరేఖలు మార్చాం. పిల్లలను బడులకు తీసుకొచ్చే కార్యక్రమానికి స్ఫూర్తి కోసం అమ్మఒడి, గోరుముద్దతో మొదలు పెట్టాం. విద్యార్థులు పదో తరగతికి వచ్చే సరికి ఐబీ విద్యా విధానంలో బోధన  అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఐబీ వాళ్లతో ఒప్పందం చేసుకున్నాం. 2035 నాటికి ఏకంగా మన పిల్లలు ఐబీలో పరీక్షలు రాసే స్థాయికి ఎదుగుతారు. 6వ తరగతి నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేస్తూ.. ఐఎఫ్ బీలను ప్రతి క్లాస్ రూంలో ఏర్పాటు చేస్తున్నాం. బైజూస్ కంటెంట్ అనుసంధానం చేశాం. ప్రతి ప్రభుత్వ స్కూల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ (ఓ పేజీ ఇంగ్లీష్, ఓ పేజీ తెలుగు) అందుబాటులోకి తెచ్చాం. ప్రతి ఏటా విద్యా సంవత్సరం జూన్ - జులైలోనూ అలాగే విద్యా సంవత్సరం చివర్లోనూ వసతి దీవెన అందిస్తున్నాం. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా పాఠ్య ప్రణాళికలో మార్పులు తెచ్చాం. దాాదాపు 30 శాతం స్కిల్ ఓరియెంటెడ్ గా మార్పులు చెందాయి.'  అని వివరించారు.


12 లక్షల మందికి లబ్ధి


ఏపీ ప్రభుత్వం 'ఎడెక్స్'తో ఒప్పందంతో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్శిటీలు, ఇతర విద్యా సంస్థలు అందించే 2 వేలకు పైగా ఎడెక్స్ ఆన్ లైన్ కోర్సులను, రెగ్యులర్ కోర్సులతో పాటుగా ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం ఎడెక్స్, అంతర్జాతీయ వర్శిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులకు మేలు చేకూరనుందని.. ఎడెక్స్ కోర్సులకు అంతర్జాతీయ వర్శిటీలే ఆన్ లైన్ లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తాయని పేర్కొన్నాయి.


Also Read: Who is Lokesh opponent in Mangalagiri : మంగళగిరిలో నారా లోకేష్‌పై పోటీ చేసేది ఎవరు ? తేల్చుకోలేకపోతున్న వైఎస్ఆర్‌సీపీ!