Plasti Flex Ban : ఏపీ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై విధించిన నిషేధాన్ని వాయిదా వేసింది. నిషేధం అమలుచేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. తయారీ సామగ్రి, టెక్నాలజీ మార్చుకోవాలని ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వాన్ని కోరారు. ఫ్లెక్సీ తయారీదారుల విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీదారులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని అధికారులను ఆదేశించారు. తయారీ సామగ్రి కోసం రూ.20 లక్షల వరకు రుణం అందించాలని సూచించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దును జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. 2027 నాటికి ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలన్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబరు 1వ తేదీ నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం వాయిదా వేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.
నిషేధం అమలు వాయిదా
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల వినియోగం, తయారీ, రవాణా, ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ముఖ్యంలో నగరాలు, పట్టణాల్లో ఈ నిషేధం అమలుకు పూర్తి అధికారులు బాధ్యత వహించాలని రాష్ట్ర గ్రామాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జీవోలో వెల్లడించింది. నిషేధం అమలును పోలీస్, రవాణా, జీఎస్టీ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్లాస్టిక్‌కు బదులుగా కాటన్, నేత వస్త్రాలు వినియోగించాలని పేర్కొంది.
గుడ్డ ఫ్లెక్సీలు
ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టాలంటే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని, కాస్త రేటు ఎక్కువైనా గుడ్డతో తయారుచేసినవే పెట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదని జగన్ అన్నారు. సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం జగన్ సమక్షంలో పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఈ ఎంవోయూ కుదిరింది. భూమిపై 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీ సైకిల్ చేసి కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాకుండా, పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారని సీఎం జగన్ వెల్లడించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ ని ఏపీలో తొలి అడుగుగా సీఎం జగన్ చెప్పారు. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలును వాయిదా వేసింది.