AP News : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్‌లు అర్ధరాత్రి 12 గంటల వరకూ తెరచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అనంతరాము సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్ ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత రెండేళ్లుగా కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే హోటళ్లు తెరిచి ఉంచాలని ప్రభుత్వం గతంలో ఆంక్షలు విధించింది. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం, పూర్వ పరిస్థితులు రావడంతో ఆహార వ్యాపార వేళల్ని పొడిగిస్తూ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించాలని హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


అర్ధరాత్రి 12 గంటల వరకూ 


బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మినహా హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాల స్టాల్స్ అర్ధరాత్రి 12 గంటల వరకు తెరచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మంగళవారం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే కోవిడ్‌ నిబంధనల ప్రకారం మాస్క్‌లు ధరించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. 2020 మార్చిలో మొదలైన కోవిడ్‌ మహమ్మారి యావత్ దేశాన్ని అతలాకుతలం చేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలకు కోవిడ్ వైరస్‌ భారిన పడటంతో పాటు భారీగా మృత్యువాత పడ్డారు. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పట్లో కోవిడ్‌ ఆంక్షలు విధించాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పరిశ్రమలు, వ్యాపారలతో పాటు అన్ని చోట్ల ఆంక్షలు పెట్టారు. రాత్రి 10 గంటల కల్లా హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత కరోనా మూడు దశల్లో ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త చక్కబడుతున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అర్ధరాత్రి వరకు అనుమతులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 


బార్ అండ్ రెస్టారెంట్లు మినహా 


కోవిడ్‌ కారణంగా గతంలో ప్రభుత్వం రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు అనుమతిచ్చేది. కోవిడ్‌ పరిస్థితులు చక్కబడటంతో వ్యాపార వేళల్ని అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించాలని కోరుతూ హోటల్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తున్న బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మినహా హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాల స్టాల్స్ అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహించుకొనేందుకు అనుమతి ఇచ్చింది. అయితే కోవిడ్‌ నిబంధనల పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు పాటు ప్రధాన నగరాల్లో రెస్టారెంట్లు, హోటళ్లు జనాలతో కిటకిటలాడనున్నాయి.