AP Fiber Net Movie Show : ఏపీ ప్రభుత్వం "ప్రజల వద్దకు సినిమా" అనే ఆలోచన చేస్తుందని, అందుకే కొత్త సినిమా మొదటి ఆటను ఇంట్లో కూర్చొని చూసేలా ఏర్పాట్లు చేస్తుందని ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. మారుమూల గ్రామాలకు కూడా ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా ఈ సదుపాయాన్ని తీసుకొస్తామన్నారు. ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నటుడు పోసాని కృష్ణమురళి, ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుడు అలీ, ఏపీ కల్చరల్‌ కమిటీ క్రియేటివ్‌ హెడ్‌ జోగినాయుడు, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.  గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ...ఏపీలో తక్కువ ధరలకు నెట్‌ సేవలను అందిస్తున్నామన్నారు. సినిమాల్ని బట్టి నిర్మాతలు, ఫైబర్‌ నెట్‌కు మధ్య ఒప్పందం కుదురుతుందన్నారు. పైరసీకి అవకాశం లేకుండా సినిమాల్ని విడుదల చేస్తామన్నారు. 


మారుమూల గ్రామాల్లోకి 


సినిమా విడుదలైన మొదటి రోజు ఇంట్లోనే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసే అవకావం ఏపీ ఫైబర్‌ నెట్‌ కల్పిస్తోందని గౌతమ్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ ఆలోచన మేరకు ప్రజల వద్దకు సినిమా తీసుకువస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సినిమా విడుదల రోజున ఫైబర్ నెట్ లో కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పిస్తామన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలకు గొప్ప అవకాశాలున్నాయన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్నవారు కూడా కొత్త సినిమాను తొలి రోజే చూసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెట్ సేవలను ఏపీలో తక్కువ ధరకు అందిస్తున్నామన్నారు.  పెద్ద హీరోలు, నిర్మాతలకు తాము వ్యతిరేకం కాదన్న గౌతమ్ రెడ్డి... సినిమాను బేస్ చేసుకుని భాగస్వామ్య రేషియో ఉంటుందన్నారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ గ్రామాలతో ఎక్కువ కనెక్ట్‌ అయిందన్నారు. ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. ఏ రోజు సినిమా రిలీజ్ అవుతుందో అదే రోజు గ్రామాల్లో సినిమా చూడవచ్చనే కాన్సెప్ట్‌ బాగా నచ్చిందన్నారు. చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమా కూడా ఫైబర్ నెట్‌లో రిలీజ్ అయితే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. 


చిన్న సినిమాలకు సదవకాశం 


విడుదల రోజే పల్లెటూళ్లలోనూ సినిమా చూడొచ్చనే అంశం నాకు బాగా నచ్చిందని పోసాని కృష్ణమురళి అన్నారు. పెద్ద హీరోల సినిమాలు కూడా ఇలా ఫైబర్‌ నెట్‌లో విడుదలైతే ప్రేక్షకులకు ఎంతో ఉపయోగం అన్నారు. అయితే ఇది పరిశ్రమకు లాభమా, నష్టమా అనేది చూడాలన్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితుల్లో ఫైబర్‌ నెట్‌లో విడుదల అనేది నిర్మాతలకు మంచి అవకాశం అని నిర్మాత సి.కల్యాణ్‌ చెప్పారు. ఏపీ ఎలక్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ మాట్లాడుతూ... ఒక నిర్మాత కష్టపడి సినిమా తీస్తే అది రిలీజ్ రోజునే పైరసీ  అవుతుందని ఆవేదన చెందారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న మనం పైరసీని ఎందుకు అరికట్టలేకపోతున్నామని, దీనిపై సినీ పెద్దలందరూ పోరాడాలన్నారు. ఫైబర్ నెట్‌లో విడుదల రోజునే మూవీ చూడడం అనేది చిన్న సినిమాకు ఆక్సిజన్ లాంటిదన్నారు. చిన్న నిర్మాతలు ఫైబర్ నెట్‌లో కచ్చితంగా రిలీజ్ చేస్తారని తెలిపారు. త్వరలో పెద్ద నిర్మాతలు కూడా ఫైబర్ నెట్ లో సినిమాలు విడుదలకు ముందుకు వస్తారని అనుకుంటున్నానని తెలిపారు.