Minister Talasani On PM Modi :బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ పరోక్షంగా చేసిన విమర్శలకు ఆ పార్టీ నేతల కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అధికార కార్యక్రమంలో రాజకీయాలు మాత్రమే మాట్లాడారని ఆరోపించారు. మోదీకి తెలంగాణపై ప్రేమలేదన్నారు. ఇందుకు గతంలో తెలంగాణ ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. వందే భారత్‌ రైళ్లను మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని మంత్రి తలసాని ప్రశ్నించారు. అవినీతి గురించి మాట్లాడుతున్న మోదీ... అదానీ అవినీతిపై నోరుమెదపరెందుకని ప్రశ్నించారు. శ్రీలంకలో అదానీకి కాంట్రాక్టు ఎవరి వల్ల వచ్చిందన్నారు. అదానీ మోసాలపై జేపీసీ ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని మోదీ చర్చకు రావాలని అని మంత్రి తలసాని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి సాధించకపోతే కేంద్రం పిలిచి మరీ ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తుందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందో లేదో మోదీ చెప్పాలన్నారు. 


తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? 


24 గంటలూ కరెంట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అవునో కాదో ప్రధాని మోదీ చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. తెలంగాణలో లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్న మంత్రి... రెండు కోట్ల ఉద్యోగాల మాటేంటని ప్రశ్నించారు. గతంలో మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు ఆయన కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌ను రావొద్దన్నారన్నారు. విభజన చట్టం హామీలపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి కాదు కనీసం ఆయన నియోజకవర్గం సికింద్రాబాద్‌కు ఏమైనా చేశారా? అని నిలదీశారు.  మోదీ చేసిన విమర్శలపై చర్చకు సిద్ధమన్నారు. ఎవరి వాదనలో బలమెంతో చూసుకుందామంటూ సవాల్‌ విసిరారు. 


ప్రోటోకాల్ ఉల్లంఘనకు తెరలేపింది మోదీయే 


మోదీ కేసీఆర్ ను తిట్టాలనుకుంటే దిల్లీలో ఉండి తిట్టుకోవచ్చని దానికి హైదరాబాద్ వరకూ రావాలా? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను విమర్శిస్తే ప్రజలే తిరగబడతారన్నారు. ప్రధాని వస్తే సీఎంలు స్వాగతం పలకాలని ఏ చట్టంలో ఉందని నిలదీశారు. అవినీతి, కుటుంబ పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు మోదీకి ఉందా? అని మండిపడ్డారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు లేవా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవినీతిలో కూరుకుపోతే విచారణలు ఎందుకు ఉండవన్నారు. తెలంగాణ ఏ రంగంలో వెనకబడిందో చెప్పాలన్నారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఇచ్చారా? జాతీయ రహదారులు ఏ పార్టీ అధికారంలో వేస్తారన్నారు. అందులో మోదీ గొప్ప ఏముందని ప్రశ్నించారు. దేశానికి తెలంగాణ నుంచి వస్తున్న ఆదాయం ఎంత? కేంద్రం తిరిగి ఇస్తుంది ఎంతో చెప్పాలన్నారు.  కోవిడ్ వ్యాక్సిన్ కూడా కనిపెట్టినట్లు మోదీ మాట్లాడుతారన్నారు. అసలు ప్రోటోకాల్ ఉల్లంఘనకు తెరలేపింది మోదీ అన్నారు.