Suraksha app launched to eradicate fake liquor in Andhr:   ఆంధ్రప్రదేశ్‌లో  నకిలీ మద్యం  విక్రయాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్'ను ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా ప్రతి మద్యం బాటిల్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి .. అది  నిజమైనదా కాదా  తెలుసుకోవచ్చు. మద్యం షాపుల్లో  అమ్మే   ముందు బాటిళ్లను స్కాన్ చేయడం తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు  రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల్లో పారదర్శకత పెంచి, నకిలీ మద్యం మాఫియాను నిర్మూలిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.  

Continues below advertisement

మద్యం కొనేవారికి స్కాన్ చేసి చూపించాలి !               

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ నిబంధనలు అక్టోబర్ 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అమలు చేస్తున్నారు.  కొత్త రూల్స్ ప్రకారం క్యూఆర్ కోడ్ స్కానింగ్ తప్పనిసరి చేశారు. ప్రతి మద్యం బాటిల్‌పై జియో-ట్యాగ్ చేసిన క్యూఆర్ కోడ్ ఉంటుంది. షాపుల్లో అమ్మే  ముందు ఈ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఇది బాటిల్ డిస్ట్రిబ్యూషన్, తయారీ, డెస్టినేషన్ వివరాలు చూపిస్తుంది. జియో-ట్యాగింగ్ వల్ల బాటిళ్లు నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. బెల్టు  దుకాణాలకు మద్యం వెళ్లదు.   

Continues below advertisement

నిబంధనలు పాటించకపోతే లైసెన్స్ రద్దు - జరిమానా                    

వినియోగదారులు 'ఏపీ ఎక్సైజ్ సురక్షా' యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, బాటిల్‌పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు. ఇది బాటిల్ ఆథెంటిక్ కాదా, మాన్యుఫాక్చర్ డేట్, ఎక్స్‌పైరీ, బ్యాచ్ నంబర్ వంటి వివరాలు చూపిస్తుంది. యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. మద్యం షాపుల లైసెన్స్ హోల్డర్లు స్కానింగ్ ప్రక్రియను అనుసరించకపోతే, లైసెన్స్ రద్దు, జరిమానాలు విధిస్తారు. ఇది రాష్ట్రంలోని 3,500కు పైగా మద్యం షాపులకు వర్తిస్తుంది. డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను కూడా ఇంటిగ్రేట్ చేశారు. షాపుల్లో UPI/QR కోడ్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు, కానీ ఇది క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో సంబంధం లేదు.               

నకిలీ లిక్కర్ ముఠాల ఆట కట్టించే ప్రయత్నం                          

ఏపీలో ఇటీవల నకిలీ లిక్కర్ తయారు చేసే ముఠా పట్టుబడింది. అందుకే ఈ యాప్ సాయంతో నకిలీ లిక్కర్ అనేది లేకుండా చేయాలని నిర్ణయించారు.   ఈ నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేసింది. షాపుల్లో స్కానర్లు, ట్రైనింగ్ ఇస్తున్నారు. వినియోగదారులు యాప్ డౌన్‌లోడ్ చేసి, ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. ఇది బ్లాక్ మార్కెట్, బెల్ట్ షాపులను అరికట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందని అధికారులు తెలిపారు.