AP News  :  ఆంధ్రప్రదేశ్  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెండో విడత ప్రొబేషన్‌ డిక్లేర్‌ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.  2020 డిసెంబరులో నెలలో రెండో విడతలో ఎంపికైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 2022 డిసెంబరు నెలతో రెండేళ్లు సర్వీసు పూర్తయినప్పటికీ నేటికీ ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయలేదు. ఉద్యోగ సంఘ నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు. రెండో విడతలో ఎంపికైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ ప్రక్రియ జూలైలో కానీ లేక ఆగస్టులో ఉండే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  కానీ, అప్పుడైననా ప్రకటిస్తారా? అంటే అధికారుల నుంచి సరైన సమాధానం లేదని ఉద్యోగులు ఆందోళన ెందుతున్నారు.


తొలి విడత చేరిన వారికి తొమ్మిది నెలల ఆలస్యంగా ప్రొబేషన్


మొదటి నోటిఫికేషన్‌ ద్వారా రిక్రూట్‌ అయిన వారికి 9నెలలు ఆలస్యంగా ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేశారు. గతేడాది మార్చి నాటికే ప్రొబేషన్‌ డిక్లేర్‌ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. ఆ గడువు పూర్తయి ఏడాది గడచినా ఇంతవరకు దీని అతీగతి లేదు. మార్చి నెల ముగుస్తున్నా ఇందుకు సంబందించిన కసరత్తు పూర్తి కాక పోవడంతో ప్రొబేషన్‌ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రొబేషన్‌ డిక్లేర్‌ కాక పోవడంతో సుమారు 17వేల మంది ఉద్యోగులు కేవలం రూ.15వేల జీతానికి విధులు నిర్వహించడం కష్టంగా మారిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 


17వేల మంది ఉద్యోగుల ఎదురు చూపులు !


ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఎపి గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం  కోరుతోంది.   గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంపికైన 7040 మంది గ్రేడ్‌ -5 పంచాయితీ కార్యదర్శులకు నేటికీ అధికారాల బదిలీ జరగలేదు. దీంతో జాబ్‌ చార్ట్‌ ప్రకారం విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. పంచాయతీరాజ్‌శాఖ విడుదల చేసిన జీఓ నెంబరు 149లో డిడిఓ అధికారాలు ఉంటాయని పేర్కొంది. అధికారాల బదిలీల ప్రక్రియ నేటికీ పూర్తి కాలేదు. క్లస్టర్‌ వ్యవస్ధను రద్దు చేసి ప్రతి పంచాయితీ కార్యదర్శిని నియమించాలని డిమాండ్‌  చేస్తున్నారు. 


ప్రొబేషన్ ఖరారైతే పే స్కేలులో మార్పు 


గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులకు రూ. 15,030 కనిష్టంగా పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది. డిజిటల్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్‌ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, గ్రేడ్‌–2 అగ్రికల్చర్‌ అసిస్టెంట్, హార్టికల్చర్‌ అసిస్టెంట్, సెరికల్చర్‌ అసిస్టెంట్, విలేజ్‌ సర్వేయర్, వీఆర్వో, వేల్ఫ్‌ర్‌ అసిస్టెంట్లకు రూ. 14,600 కనిష్ట పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా పీఆర్సీ కమిటీ సిఫార్సు చేసింది. వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీకి రూ. 15,030 కనిష్ట పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది. మిగిలిన వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్‌–డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులరైజేషన్‌ సెక్రటరీ, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, వెల్ఫ్‌ర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలకు రూ. 14,600 కనిష్టంగా పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా ఉంటుంది.