AP Vs TS In Supreme Court : తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజన జరిగినా ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా జరగలేదని.. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ సహకరించడం లేదని ఆరోపిస్తూ.. పిటిషన్ దాఖలు చేసింది.  ఉమ్మడి ఆస్తుల విలువ రూ. 1, 42, 601 కోట్లు ఉందని.. దాన్ని విభజించలేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. తెలంగాణనే కాలయాపన చేస్తోందని విభజన జరగాల్సిన ఆస్తులు 91 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. విభజన జరిగి ఎనిమిది ఏళ్లవుతున్నా.. ఆస్తుల విభజనకు తెలంగాణ సర్కార్ సహకరించడం లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం ఏపీ ప్రజల హక్కులకు తెలంగాణ భంగం కలిగించిందని ఏపీ ప్రభుత్వం  పిటిషన్‌లో పేర్కొంది. ఆస్తుల విభజన త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని కోరింది. 


కరెంట్ బకాయిల కోసం ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ 


ఇప్పటికే తెలంగాణ సర్కార్‌పై తెలంగాణ  హైకోర్టులోనూ ఏపీ సర్కార్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రాకంర కరెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. తెలంగాణ జెన్కోను దివాలా దీసినట్లుగా ప్రకటించి తమకు రావాల్సిన నిధులు తమకు ఇప్పించాలని కోరింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ఎన్సీఎల్టీలో పిటిషన్ ఉపసంహరించుకుంది.  గత సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. మరో వైపు తెలంగాణ సర్కార్ ఏపీకి తాము ఇవ్వడం కాదు.. తమకే ఏపీ ఇవ్వాలని వాదిస్తూ కౌంటర్ దాఖలు చేసింది.  ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టులో ఉంది.  


ఉండవల్లి విమర్శలతో కదిలిన ఏపీ ప్రభుత్వం 
 
ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ ప్రయోజనాలపై జగన్ పూర్తి స్థాయిలో రాజీపడిపోయారని.. అలా అయితే ఆయన రాజకీయ  భవిష్యత్  కు పులిస్టాప్ పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఆ అంశంపై దుమారం రేగింది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఎంత  వరకైనా పోరాడతామని ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో హడావుడిగా పిటిషన్ దాఖలు చేయడం విశేషం. విభజన చట్టం ప్రకారం ఆస్తులను రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో విభజించుకోవాలి. లేకపోతే కేంద్రం ఆ పని చేయాలి. ఈ రెండూ జరగడం లేదు. 


ఎక్కడిదక్కనే ఉమ్మడి ఆస్తుల విభజన అంశం


తెలుగుదేశం హయాంలో ఉమ్మడి ఆస్తుల విభజనకు గవర్నర్ గా ఉన్న  నరసింహన్ చాలా సమావేశాలు పెట్టారు. కానీ ఆయన తెలంగాణకు అనుకులంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు సమావేశాలపై ఆసక్తి చూపలేదు.  ఉన్నత విద్యా మండలి విషయంలో ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచాలని ఆదేశాలను హైకోర్టు ఇచ్చింది. ఉమ్మడి ఆస్తులు మొత్తానికి ఈ తీర్పు వర్తిస్తుందన్న అభిప్రాయం వినిపించినా ఇంత వరకూ ఆస్తుల విభజన సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.