PD Act Against Illegal Transportation of PDS Rice | అమరావతి: పేదలకు ప్రభుత్వాలు అందించే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న విదేశీ నౌక (Stella Ship)పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రి నాదెండ్ల అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులతో  సమీక్ష సమావేశం జరిగింది. కాకినాడ పోర్టులోని అయిదు వేర్ హౌసుల్లో సార్టెక్స్ మిషన్లు ఉన్న అంశంపై చర్చించారు. వేర్ హౌసుల్లో యంత్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారని మారిటైమ్ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను రాష్ట్ర మంత్రులు ప్రశ్నించారు. సార్టెక్స్ యంత్రాలను ఏర్పాటుపై విచారణ చేపట్టాలని, అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.




రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం


ఆంధ్రప్రదేశ్ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న బియ్యం, ఇతరత్రా అక్రమ రవాణా వ్యవహారంపై మంత్రులు సమీక్షలో కీలకంగా చర్చించారు. నాదెండ్ల, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ జరిపిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకనుంచి ఎవరైనా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం. కాకినాడ పోర్టులో భద్రత వ్యవస్థ బలోపేతం చేయాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టు భద్రత కోసం ఛీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నియమించాలని చర్చించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని మంత్రులు భావిస్తున్నారు. 






కాకినాడ పోర్టుపై స్పెషల్ ఫోకస్
కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకూ జరిగిన రవాణా కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కాకినాడ పోర్టుకు వెళ్లే లారీల నుంచి అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నాదెండ్ల మనోహర్. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా ఓడ ఘటనలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదట కాకినాడ కలెక్టర్ , కొందరు ఉన్నతాధికారులతో వెళ్లి కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ సాహసం దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. 



ఆ సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీకి వచ్చాక కాకినాడ పోర్టు విషయంపై ఫోకస్ చేశారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కొందరు ఉన్నతాధికారులతో కలిసి వెళ్లి పవన్ కళ్యాణ్ కాకినాడ యాంకరేజ్ పోర్టులో తనిఖీలు చేయడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను అధికారులు అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ తూర్పు దేశంలో భద్రతకు ముప్పు పొంచి ఉందని, కాకినాడ పోర్టులో కేవలం 16, 17 మంది అధికారులే ఉన్నారని.. టన్నుల కొద్దీ రేషన్ బియ్యం విదేశాలకు రవాణా చేశారని ఆరోపించారు. సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. అయితే కేంద్రం పరిధిలో ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి చర్యలు తీసుకునే అధికారం లేదని, కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిబంధనలు చెబుతున్నారు. 


Also Read: Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !