Godavari Floods Effects : ఏపీలో వర్షాలు తగ్గినా గోదారమ్మ మాత్రం ఇంకా శాంతించలేదు. ఎగువ నుంచి వస్తోన్న భారీ వరదతో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ముంపు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందల సంఖ్యలో వన్యప్రాణులు, పశువులు గోదావరిలో కొట్టుకుపోతున్నాయి. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి వరద ప్రవాహం కాస్త తగ్గుతోంది. సముద్రంలోకి 25.64 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద వరద 21.60 అడుగులకు చేరుకుంది. 


ప్రమాదకరంగా ఏటిగట్లు 


వరద తగ్గుముఖం పట్టినా లంక గ్రామాలు, విలీన మండలాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆ ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. చింతూరు, కూనవరం, ఎటపాక, వి.ఆర్‌.పురం మండలాలు వారం రోజులుగా నీటిలోనే మగ్గుతున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. చింతూరు, కూనవరం, వి.ఆర్‌.పురం, ఎటపాక  మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లంక గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. ఈ గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాల్లోకి చేరుస్తున్నారు. గోదావరి ఉద్ధృతి కారణంగా కోనసీమ జిల్లాలో ఏటిగట్లకు బీటలు వస్తున్నాయి. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రాజోలులో ఆరు చోట్ల ఏటిగట్టు బలహీనపడింది. గట్టుపై నుంచి వరద పొంగుతోంది. ఏటిగట్లపై ఇసుక బస్తాలు వేస్తూ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.  


చావు కష్టాలు 


కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో వరద ప్రభావం తగ్గలేదు. చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు నానాకష్టాలు పడుతున్నారు.  అయినవిల్లి మండలం అయినవిల్లి లంకకు చెందిన తిరుకోటి నాగవేణి (50) అనారోగ్యంతో మృతి చెందారు. అయినవిల్లి లంక వరదలో చిక్కుకుపోవడంతో అంత్యక్రియలు చేసేందుకు బంధువులు అవస్థలు పడుతున్నారు. వరద నీటిలో నుండి వేరే ప్రాంతానికి తీసుకెళ్లిన బంధువులు అక్కడ అంతిమ సంస్కారాలు చేశారు. 


వంతెన లేక గిరిజనుల అవస్థలు


అల్లూరి జిల్లా ఏజెన్సీలో పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తు న్నాయి. పెద బయలు మండలంలోని జామిగుడ పంచాయతీ పరిధిలోని గుంజివాడ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో 50 గ్రామాల గిరిజనులు రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు దాటి మండల కేంద్రానికి వచ్చేందుకు డిప్పల సహాయంతో నానా అవస్థలు పడుతున్నామన్నారు.  పాఠశాలలకు వెళ్లే పిల్లలు ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ ఐటీడీఏ అధికారులు స్పందించి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.


వరద నీటిలో కొట్టుకుపోయిన 300 జింకలు


వరద బీభత్సానికి గోదావరి పొంగి ప్రవహిస్తుండటంతో  గోదావరి లంక ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతుండడంతో వన్యప్రాణులు ఊళ్లోకి వస్తున్నాయి. ఎక్కడ మెరక ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో గుంపులుగా సంచరిస్తున్న పరిస్థితి రావులపాలెం లంక ప్రాంతాల్లో కనిపిస్తోంది.  కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండల పరిధిలోకి వచ్చే  లంక ప్రాంతాల్లో జింకలు గుంపులుగా సంచరిస్తూ ఉండడం పలువురు కంటపడ్డాయి. తమ సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. గోదావరి నది మధ్యలో ఉండే పచ్చిక బయళ్ల చిగుళ్లు తింటూ చెంగు చెంగున గంతులేస్తూ జీవించే జంకలకు వరదలు కష్టాలు తెచ్చాయి. వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో ఈ జింకలన్నీ నీటి ప్రవాహనికి కొట్టుకుపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి పులసలంకలో సుమారు 300 పైబడి జింకలు, లేళ్లు ఉన్నాయి. అయితే శనివారం  వరదనీటి ప్రవాహం అధికమవ్వడంతో పులసలంక చాలా వరకు మునిగిపోయింది. దీంతో ఇవి ఒక్కొక్కటిగా గోదావరిలో కొట్టుకుపోతున్నాయి. పొట్టిలంక సమీపంలో గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోతున్న నాలుగు జింకలను రైతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అయితే ఒక జింక ఒడ్డుకు చేరినప్పటికీ కుక్కల దాడిలో మృతి చెందింది. దీనిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.  


వన్యప్రాణులకు శాపం


పులసల లంకలో సుమారు 1500 గొర్రెలు చిక్కుకుపోగా మూడు రోజుల నుంచి అధికారులు శ్రమించి వాటిని బోట్లు, పంట్లు ద్వారా బయటికి తరలించారు. అయితే జింకలను అలా తీసుకురావడం సాధ్యంకాదని అధికారులు అంటున్నారు. చెంగుచెంగున పరిగెత్తే వీటిని పట్టుకుని తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్నది. మనషులను చూస్తేనే జింకలు పారిపోతాయి. 2020 వరదలకు సుమారుగా 100 జంకలు కొట్టుకుపోగా ప్రస్తుత వరదలకు మిగిలిన 300 కూడా కొట్టుకుపోతున్నాయని పులసలంకలో వ్యవసాయం చేసే రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే రావులపాలెం బ్యారేజీ దిగువన గల లంకల్లో ఉండే జింకలు కూడా ఈ వరద తాకిడికి కొట్టుకుపోతున్నాయి. ప్రతి ఏటా వచ్చే వరదలు ఈ వన్యప్రాణులకు శాపంగా మారుతున్నాయి.