Sharmila : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పదమూడేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన వార్తను కోట్ చేస్తూ.. సీఎం జగన్ పై మండిపడ్డారు. నా అక్కలూ, నా చెల్లెమ్మలు, నా తల్లులూ, నా అవ్వలూ అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలూ నటించే ముఖ్యమంత్రి గారు అని సంబోధిస్తూ మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోందని మండిపడ్డారు. లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
అసలు కేసు ఏమిటంటే ?
ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి హైస్కూల్‌లో పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వచ్చిన బాలికను గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు నలుగురు యువకులు. అత్యాచారాన్ని ఆ బాలుడితో పాటు ఉన్న నలుగురు యువకులు వీడియో తీశారు. బాధిత బాలికను వేధించడం ప్రారంభించారు. ఆ బాలిక ఆకతాయిలకు ఎంతకీ లొంగకపోవడంతో అత్యాచార వీడియోలను వైరల్ చేశారు. ఆ వీడియోలు బాధిత బాలిక తల్లి వద్దకు చేరాయి. దీంతో తల్లి బాలికను అడగగా జరిగిందంతా తల్లికి వివరించిందని పోలీసులు తెలిపారు.
బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
బాలిక తల్లి మండవల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రామచంద్రరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కైకలూరు రూరల్ సిఐ కృష్ణకుమార్ వివరాలు సేకరించి అత్యాచారానికి పాల్పడిన బాలుడిని విజయవాడ జువైనల్‌కు తరలించారు. అత్యాచార వీడియోలను చిత్రీకరించి వైరల్ చేసిన నలుగురు యువకులను అరెస్టు చేసి కైకలూరు కోర్టుకు తరలించారు.
లండన్‌లో సీఎం జగన్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత రోజు ఆయన లండన్ వెళ్లారు. మళ్లీ ఒకటో తేదీన తిరిగి వస్తారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ కనుసన్నల్లోనే పాలన నడుస్తోంది. అయిేతే ఎన్నికలకు సంబంధం లేని వ్యవహారాలు అన్నీ.. కోడ్ తో సంబంధం లేకుండా పరిపాలన చేయవచ్చు. కానీ ఎన్నికల్లో గెలిస్తే పాలనలో తీరిక లేకుండా ఉండాలి కాబట్టి.. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉండదని.. ఆయన టూర్ కు వెళ్లినట్లుగా తెలుస్తోంది.