YS Jagan Mohan Reddy likely to visit Tirumala soon| లడ్డూ వివాదం దుమారం రేపుతున్న సమయంలో ఏపీ మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. కాలి నడకన తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శంచుకోనున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు. ఆలయాల శుద్ధి కార్యక్రమాలు చేపట్టి స్వామివారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ సెప్టెంబర్ 28న పాప ప్రక్షాళణ పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుమల అంశంలో చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళణగా పూజలు చేస్తామని జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తిరుమల అంశంపై ప్రజల్లో తమపై వ్యతిరేకత వస్తున్నందున, హిందూ సాంప్రదాయాలకు తాము వ్యతిరేకం కాదని నిరూపించేందుకు కాలి నడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీయాలని ఏపీ సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ (TTD) పేరు ప్రఖ్యాతులను, లడ్డూ పవిత్రతను అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అభిప్రాయపడ్డారు. తిరుమల వెంకటేశ్వరస్వామిపై, పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారంతో శ్రీవారి విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకు.. ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు సెప్టెంబరు 28న ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొనాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలు ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తుండగా.. వైసీపీ శ్రేణులు పాప ప్రక్షాళన పూజలు చేయాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఈనెల 28న తిరుమలకు మాజీ సీఎం జగన్
తాడేపల్లి: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ త్వరలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. సెప్టెంబర్ 27న శుక్రవారం రాత్రికి జగన్ తిరుమలకు చేరుకుంటున్నారు. సెప్టెంబరు 28న శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.