Buggana News: నంద్యాల జిల్లాలో  రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. రెండోసారి మంత్రి పదవి దక్కించుకుని మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన నేత.. అసెంబ్లీలో ప్రతిపక్షాలను సైతం అడిగిన లెక్కలకు అడిగినట్లే సమాధానం చెప్పే వ్యక్తి బుగ్గన. కానీ ఇటీవల ఆయనకు తన సొంత నియజకవర్గంలోనే ఓ మహిళ నుండి ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రభుత్వ పథకాలు వాటివల్ల ప్రభుత్వం విధిస్తున్న పన్నులపై ముక్కుసూటిగా ప్రశ్నించింది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో హుషారుగా ఉన్న ప్రతిపక్షాలను సైతం మంత్రి బుగ్గన కడిగి పారేశారు. అటువంటి నేత ఇటీవలి పనితీరుపై ముఖ్యమంత్రి సీరియస్ కావడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 


ఒక్కప్పటి కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గం అంటే టీడీపీకి కంచుకోట లాంటిది. అటువంటి కంచుకోటలో వైసీపీ జెండా ఎగిరింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రి కూడా అయ్యారు. కర్నూలు జిల్లాలో కంచుకోటలా భావించే డోన్ నియోజకవర్గంలో వైసీపీ గెలుపుతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారనే చెప్పుకోవాలి. అందుకు తగ్గట్లుగానే జగన్ టీంలో బుగ్గనకు మంచి స్థానమే దక్కింది. పార్టీ ఆశలను నెరవేరుస్తూ బుగ్గన కూడా చాలా అగ్రెసివ్ గా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. విమర్శకు ప్రతివిమర్శ, ప్రశ్నకు దీటుగా జవాబు చెబుతారు బుగ్గన. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల వారు అడిగే ప్రశ్నలకు దీటుగా, ధాటిగా సమాధానాలు చెబుతారన్న పేరుంది బుగ్గనకు. అయితే అలాంటి వ్యక్తిపైకి ఓ మహిళ డైరెక్ట్ గా ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బుగ్గన సతమతం  అయ్యారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అన్నింటి ధరలు పెంచి, పన్నులు పెంచి మా నుండి డబ్బులు తీసుకుని... మీ పేరు పెట్టుకుని మాకే ఇస్తున్నారని రాష్ట్ర ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. 


గడపగడప కార్యక్రమంలో తూతూ మంత్రంగా బుగ్గన!


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో భాగంగా దాదాపుగా రెండున్నర  సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాల గురించి ప్రజలకు చెప్పేందుకు గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తూతూ మంత్రంగా చేపడుతున్నారని పార్టీ వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి. బుగ్గన.. తన సొంత నియోజవర్గాన్ని, ప్రజలను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాల పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదని అంటున్నాయి. డోన్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలూ అంటున్నట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అదే సమయంలో టీడీపీ శ్రేణులు నియోజకవర్గంలోని సమస్యల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలు కూడా మంత్రి పనితీరుపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. సామాన్య ప్రజల నుండి వస్తున్న ఈ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పలేక వైసీపీ శ్రేణులు సతమతం అవుతున్నారు. 


ఏ గడప కెళ్ళిన నిరసన సెగతో బుగ్గ నాకు షాక్...!


గడపగడపలో మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగానే పాల్గొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో అర్హత లేని వాళ్లు చాలా మంది ఉంటున్నారన్న విమర్శలు.. ప్రజల నుండే వస్తున్నాయి. పథకాల అమలు తీరు, పన్నుల పెంపు, ధరల పెరుగుదల, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై బుగ్గను ప్రజల నుండి చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటికి సమాధానం చెప్పలేక బుగ్గన సతమతం అవుతున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. 


తీరు మార్చుకోకపోతే కష్టమేనని ఈ మధ్యే డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బుగ్గను పార్టీ అధిష్ఠానం నుండి వార్నింగ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. పద్ధతి మార్చుకుని ప్రజల్లోకి వెళ్లాలని గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది.